Etela Rajender : బీజేపీ ప్రభుత్వం వస్తే.. సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు : ఈటల రాజేందర్ ప్రకటన

Siva Kodati |  
Published : Nov 19, 2023, 07:40 PM IST
Etela Rajender : బీజేపీ ప్రభుత్వం వస్తే.. సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు : ఈటల రాజేందర్ ప్రకటన

సారాంశం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఐటీని రద్దు చేస్తామని ప్రకటించారు బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతంలో సింగరేణి కార్మికుల సంఖ్య 63 వేలు వుండగా.. ఇప్పుడు 39 వేలకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఐటీని రద్దు చేస్తామని ప్రకటించారు బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంచిర్యాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు సమానమైన పనికి సమాన వేతనం ఇస్తామని వెల్లడించారు. సింగరేణిలో నిరుద్యోగులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ పోగొట్టారని ఆయన ఆరోపించారు. తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రైవేట్‌పరం చేశారని కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మూడో స్థానమే వస్తుందని రాజేందర్ జోస్యం చెప్పారు. గతంలో సింగరేణి కార్మికుల సంఖ్య 63 వేలు వుండగా.. ఇప్పుడు 39 వేలకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి చచ్చుబడిపోయిందని .. కార్మికుల హక్కులను కాలరాశారని, నేటికీ సింగరేణిలో ఎన్నికలు నిర్వహించలేదని ఈటల దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదని, చివరికి నిరుద్యోగ భృతి హామీని కూడా నెరవేర్చుకోలేదని రాజేందర్ దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ టీ అమ్మారని.. అలాంటి స్థాయి నుంచి ఆయన దేశ ప్రధానిగా ఎదిగారని ఈటల ప్రశంసించారు. కష్టాన్ని, ధైర్యాన్ని నమ్ముకోవడం వల్లే నరేంద్ర మోడీ ఈ స్థాయికి చేరుకున్నారని రాజేందర్ తెలిపారు. 

ALso Read: బీజేపీకి అధికారమిస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: నారాయణఖేడ్ సభలో బండి సంజయ్

అంతకుముందు నారాయణ ఖేడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని  చెప్పారు. నారాయణఖేడ్ లో అసలైన ఆట మొదలైందని.. 3 ఎకరాల సామాన్యుడికి, 3వేల ఎకరాల ఆసాములకు మధ్య యుద్దం స్టార్ట్ అయ్యిందన్నారు. మీరు ఆ గట్టు(ఆసాముల)న ఉంటారా? ఈ గట్టున(సామాన్యుడు సంగప్ప) పక్షాన ఉంటారా.. తేల్చుకోవాలని  బండి సంజయ్ ప్రజలను కోరారు. 

ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ 70 ఏళ్లుగా రెండు కుటుంబాలే పెత్తనం చెలాయిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నారాయణఖేడ్ అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నాయని  బండి సంజయ్ దుయ్యబట్టారు. ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మీకు సంగప్ప అండగా ఉంటారన్నారు. సంగప్ప వెనుక తాను… ప్రధాని మోదీ ఉన్నారని  బండి సంజయ్ భరోసా ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!