తామ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడ వదలబోమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో తమ పార్టీకి చెందిన నేతలపై మరిన్ని సోదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మంత్రి మల్లారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ వదలం, ఎవరిని విడువమని ఆయన తేల్చి చెప్పారు. గురువారంనాడు మంత్రి మల్లారెడ్డి తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని మల్లారెడ్డి చెప్పారు.
ఇలాంటి రైడ్ ను తాను తన జీవితంలో చూడలేదని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.ఈ దాడులు భాధాకరమన్నారు. మూడు రోజులుగా ఐటీ దాడులను కవర్ చేస్తున్న మీడియానే ఇబ్బంది పడితే తాము ఎంత ఇబ్బంది పడ్డామో ఆలోచించాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చే వరకు ఎన్ని అరాచకాలు చేస్తారో చేసుకోవాలని మల్లారెడ్డి చెప్పారు.
undefined
తప్పులు చూపిస్తే ఫైన్ కడతామన్నారు. తాము దొంగలమా , క్రిమినల్స్ మా , డాన్‌లమా అని ఆయన ప్రశ్నించారు. ఐటీ దాడుల విషయం తెలుసుకుని వచ్చిన కార్యకర్తలను దండం పెట్టి పంపించినట్టుగా మల్లారెడ్డి గుర్తు చేశారు. ఐటీ అధికారుల సోదాలకు తాను సహకరించినట్టుగా మల్లారెడ్డి వివరించారు. ఐటీ అధికారిని బంధించాలనుకొంటే తన నివాసంలోనే బంధిస్తానన్నారు. కానీ బోయినపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు ఎందుకు తీసుకెళ్తానని ఆయన ప్రశ్నించారు.
వందలాది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని తీసుకొచ్చి సోదాలు నిర్వహించారన్నారు. తన పెద్ద కొడుకు మహేందర్ రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తన కొడుకు ఆసుపత్రిలో చేరిన విషయం తనకు చెప్పకుండా దాచిపెట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
also read:పార్టీ మారాలనే ఐటీ దాడులు: మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి
తాను ఐటీ అధికారుల విధులకు భంగం కల్గించినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మల్లారెడ్డి చెప్పారు. సోదాలు సాగుతున్నంత సేపు ఐటీ అధికారులతో కలిసే ఉన్నానన్నారు. ఐటీ అధికారులు తయారు చేసిన స్టేట్ మెంట్ పై సంతకం చేసిన తర్వాతే తాను బయటకు వచ్చినట్టుగా మల్లారెడ్డి చెప్పారు. ఐటీ అధికారుల ల్యాప్ టాప్ ను పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్టుగా చెప్పారు.
ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం తప్పు లేదని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఐటీ సోదాల పేరుతో ప్రజల హక్కులకు భంగం కల్గించవద్దన్నారు.కక్షగట్టినట్టుగా దాడులు నిర్వహించడం సరికాదన్నారు.అంతేకాదు ఎవరో ఆదేశించినట్టుగా సోదాలు నిర్వహించడం సరైంది కాదని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.