భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పెరుగుతుంది. ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా భద్రాచలానికి వరద పెరుగుతుంది.
ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతుంది. శుక్రవారంనాడు ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 18.3 అడుగులకు చేరుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతున్నట్టుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.
నైరుతి రుతుపవనాలు ప్రభావంతో మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో కూడ రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి వరద పెరిగింది. ఎగువ నుండి వరద ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉంది.
గత ఏడాది జూలై మాసంలోనే గోదావరి నదికి భారీ వరద వచ్చింది. గత ఏడాది జూలై 23వ తేదీన భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 45.60 అడుగులకు చేరింది. 50 ఏళ్ల నాటి స్థాయిలో గోదావరికి గత ఏడాది వరద వచ్చింది. జూలై మాసంలోనే ఈ స్థాయిలోనే వరద రావడం గత ఏడాది జరిగింది.ఈ తరహలో గోదావరికి వరద రావడం అరుదుగా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ ఏడాది మాత్రం నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూన్ మాసంలో 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు