
Medaram Jatara: తెలంగాణ కుంభమేళా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జన జాతర (Medaram Jatara 2022) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఇప్పటికే తెలంగాణ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి గిరిజనులు మేడారంకు తరలుతున్నారు. అయితే ఈ జాతర (Medaram Jatara)లో అపశృతి చోటుచేసుకుంది.
మేడారంలో గురువారం (ఫిబ్రవరి 17) రాత్రి.. సమ్మక్క తల్లిని గద్దెల పైకి తీసుకొచ్చిన సమయంలో క్యూ లైన్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో గాయపడినవారికి ప్రథమ చికిత్స అందించే లోపే ఇద్దరు భక్తులు మృతి చెందారు. పోలీసుల నిర్లక్ష్యంతో నే జరిగిందని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీఐపీ, వీవీఐపీల సెక్యూరిటీకి ప్రాధాన్యమిచ్చే పోలీసులు సామాన్య భక్తుల గురించి పట్టించుకోవడం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు, అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తడమేనని ప్రాథమిక విచారణలో తెలింది.
అనుభవం లేని ఐపీఎస్ అధికారులతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త ఐపీఎస్ అధికారులు జాతరను పూర్తిగా కమాండ్ చేస్తున్నారు. వారి అతి ఉత్సాహంతో భక్తులు, స్థానిక పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం - పస్రా మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ నెల 16న ప్రారంభమైన ఈ జాతర ఫిబ్రవరి 19తో ముగియనుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ప్రస్తుతం మేడారంలో ఎటు చూసినా జనసంద్రమే. ఇప్పటి వరకు అరవై లక్షలకుపైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు.
రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వస్తారు. జిల్లా కేంద్రం ములుగుకు 44 కి.మీ దూరంలో ఈ జాతర జరుగుతుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరలో మొదటి రోజు సారలమ్మ మేడారం గద్దెల పైకి చేరుతుంది. రెండో రోజు చిలుకల గుట్ట నుంచి ఊరేగింపుగా సమ్మక్కను గద్దెల పైకి తీసుకొస్తారు. మూడో రోజు సమ్మక్క-సారలమ్మ తల్లులు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.