బరిలో రేవూరి: కీలక నిర్ణయం దిశగా నాయిని, ఆ పార్టీకి షాకేనా...

By narsimha lodeFirst Published Nov 13, 2018, 11:18 AM IST
Highlights

ప్రజా కూటమి( మహాకూటమి)లో సీట్ల సర్దుబాటు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. 


వరంగల్: ప్రజా కూటమి( మహాకూటమి)లో సీట్ల సర్దుబాటు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ స్థానం నుండి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు డీసీసీ కార్యాలయంలో స్వీయ నిర్భంధంలో ఉన్నారు.

వరంగల్ జిల్లాలోని  నర్సంపేట స్థానం నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేయాలని  భావించారు. 2009 ఎన్నికల్లో  ఈ స్థానం నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో  రేవూరి ప్రకాష్‌రెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేసి  ఓటమి పాలయ్యారు.

అయితే గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసిన  ఇండిపెండెంట్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి  విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కని కారణంగా మాధవరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు.

సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి వదిలేందుకు సిద్దంగా లేదు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి వరంగల్ జిల్లాలో ఏదో ఒక స్థానం నుండి పోటీ  చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో వరంగల్ వెస్ట్ స్థానం నుండి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డిని బరిలోకి దింపాలని ఆ పార్టీ  నాయకత్వం భావించింది. ఈ మేరకు వరంగల్ వెస్ట్ స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. ఈ స్థానం నుండి రేవూరి ప్రకాష్‌రెడ్డి నుండి టీడీపీ బరిలోకి దింపుతున్నట్టు ఆ  పార్టీ ప్రకటించింది.

వరంగల్ వెస్ట్ స్థానం నుండి పోటీ చేసేందుకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి టికెట్టు ఆశిస్తున్నారు. ఈ స్థానం టీడీపీకి కేటాయించే అవకాశం ఉందని తెలుసుకొన్న డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వర్గీయులు  వరంగల్ డీసీసీ కార్యాలయంలో స్వీయ నిర్భంధంలో ఉన్నారు.  

పొత్తులో భాగంగా వరంగల్ వెస్ట్  టీడీపీకి కేటాయించినట్టు ప్రకటన వెలువడింది. దీంతో మంగళవారం నాడు ఉదయం  డీసీసీ కార్యాలయంలో స్వీయ నిర్భంధంలో ఉన్న  కాంగ్రెస్  నేతలను డీసీసీ అధ్యక్షుడు  నాయిని రాజేందర్ రెడ్డి  పరామర్శించారు. దీక్షను విరమించాలని కోరారు.

తన అనుచరులతో ఇవాళ సమావేశమై తన భవిష్యత్‌ కార్యాచరణను  ప్రకటించనున్నారు.  ఇండిపెండెంట్‌గా రాజేందర్ రెడ్డి బరిలోకి దిగుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

కాంగ్రెస్ పార్టీకి  రాజేందర్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని  ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో  తన నిర్ణయాన్ని  సాయంత్రానికి  ప్రకటించనున్నట్టు   రాజేందర్ రెడ్డి ప్రకటించారు.

మరోవైపు  తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వరంగల్ జిల్లాలో టీడీపీ పోటీ చేస్తే  ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు.  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడైతే వరంగల్ వెస్ట్ నుండి పోటీ చేస్తే విజయం  దక్కుతోందా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

click me!