
తెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. పే స్కేల్, ఉద్యోగ క్రమబద్దీకరణపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దాదాపు 50 రోజులుగా వారు సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే వారి సమస్యలను ప్రభుత్వ పరిష్కరించడం అయితే ఇన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం స్పందించకోవడంతో ఓ వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాలు.. కంచర్ల వెంకటేశ్వర్లు గ్రామ రెవెన్యూ సహాయకునిగా పనిచేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం.. తమకు పే స్కేల్ వస్తుందో.., రాదో.. అని వెంకటేశ్వర్లు తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో ఇప్పటికే కొందరు వీఆర్ఏలు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కూడా ఓ వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్నాడు. నాగిరెడ్డిపేట మండలం బొల్లారంకు చెందిన వీఆర్ఏ అశోక్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీఆర్ఏలు చేస్తున్న నిరసనల్లో అశోక్ కూడా చురుకుగా పాల్గొన్నాడు. ఆందోళనలు చేసినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదనే మనస్తాపంతోనే అశోక్ ఆత్మహత్య చేసుకున్నారని వీఆర్ఏల సంఘం నేతలు చెప్పారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వీఆర్‌ఏలు అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.