విజయశాంతి ప్రకటన షాక్: కేసీఆర్ గురిపెట్టినా కాంగ్రెస్ కు తగిలింది

By telugu teamFirst Published Nov 9, 2020, 9:02 AM IST
Highlights

సినీ నటి విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ కు గురిపెడుతూ ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నా అది కాంగ్రెసు పార్టీకే తగులుతోంది. కాంగ్రెసు మీద ఆమె పరోక్షంగా తవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: కాంగ్రెసు నాయకురాలు, సినీ నటి విజయశాంతి చేసిన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గురిపెట్టినట్లు కనిపిస్తోంది. అయితే, అది కాస్తా కాంగ్రెసు పార్టీకే తగిలింది. దీంతో విజయశాంతి కాంగ్రెసులో కొనసాగుతారా, లేదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆమె బిజెపిలో చేరడానికే సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. 

కేసీఆర్ కాంగ్రెసు నేతలు కొందరిని ప్రలోభపెట్టి, భయపెట్టి ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారని, కాంగ్రెసు బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బిజెపి తెలంగాణలో సవాల్ విసిరే స్థాయికి వచ్చిందని విజయశాంతి అన్నారు. ఆ రకంగా కాంగ్రెసు బలహీనపడి బిజెపి బలపడిందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. 

తన ప్రకటనలో విజయశాంతి కాంగ్రెసు పార్టీ పరిస్థితిపై కూడా మాట్లాడారు. కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ మరికొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవికావచ్చునని, ఇప్పుడు ఇక కాలం, ప్రజలు నిర్ణయించాలని ఆమె అన్నారు. తద్వారా ఆమె కాంగ్రెసు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. 

ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మాణిక్యం ఠాగూర్ విజయశాంతి ఇంటికి వెళ్లి ఆమెతో చర్చలు జరిపారు. అంతకు కొద్ది రోజుల ముందు బిజెపి నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి విజయశాంతితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె బిజెపిలో చేరుతారనే ప్రచారం ముమ్మరమైంది. ఆమెను నిలువరించడానికి మాణిక్యం ఠాగూర్ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే స్వయంగా ఆమె ఇంటికి వెళ్లారు. 

మాణిక్యం ఠాగూర్ తో విజయశాంతి ఏం చెప్పారో తెలియదు గానీ తాజాగా ఆమె ఈ ప్రకటన జారీ చేసి తాను పార్టీ మారబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. విజయశాంతి పార్టీలోనే ఉంటారని కాంగ్రెసు నాయకులు చెబుతున్నప్పటికీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో ఆమె వ్యవహరించిన తీరు కూడా ఆ విషయాన్న పట్టిస్తోంది. ప్రచార కమిటీ సారథి అయిన విజయశాంతి ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతే కాకుండా ఆమె ఓటర్లకు చేసిన విజ్ఞప్తి మరింతగా సందేహాలను కలిగిస్తోంది. కాంగ్రెసు పార్టీకి ఓటేయాలని ఆమె కోరలేదు. పైగా ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని ఆమె దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

click me!