Telangana: చివరి జాబితాలోనూ విజయశాంతికి చోటులేదు.. అసెంబ్లీ బరిలో లేనట్టే

By Mahesh K  |  First Published Nov 10, 2023, 2:42 PM IST

బీజేపీ చిట్ట చివరి జాబితాలోనూ మాజీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి చోటుదక్కలేదు. దీంతో ఆమె అసెంబ్లీ బరిలో లేదనే విషయం స్పష్టం అవుతున్నది. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న సంగతి తెలిసిందే.
 


హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. శుక్రవారం ఉదయం 14 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులో మాజీ ఎంపీ విజయశాంతి పేరు గల్లంతైంది. చివరి జాబితాలోనూ ఆమె పేరు లేకపోవడంతో ఇక ఆమె అసెంబ్లీ బరిలో లేనట్టే అని కన్ఫమ్ అయింది. అభ్యర్థుల జాబితాలో విజయశాంతి పేరు ఉంటుందనే వార్తలు వచ్చాయి. విజయశాంతి కూడా అందుకోసం ఎదురుచూసినట్టు తెలిసింది. కానీ, కొంతకాలంగా ఆమె పార్టీ వ్యవహారాలపై మౌనం దాల్చారు. చివరికి బీజేపీ ఆమెను పక్కన పెట్టేసింది.

ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆసక్తి చూపడం లేదని, మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లోనే పోటీ చేయాలని ఎదురుచూస్తున్నట్టు ఇటీవలే కథనాలు వచ్చాయి. కానీ, బీజేపీ పార్టీ కీలకమైన నేతలను, సిట్టింగ్ ఎంపీలనూ బరిలోకి దించింది. తొలి జాబితాలోనే విజయశాంతి పేరు వస్తుందని అనుకున్నారు. కానీ, అప్పటి నుంచి ఆమె పేరు ఏ జాబితాలోనూ లేకుండా పోయింది.

Latest Videos

కొంత కాలంగా పార్టీ వ్యవహారాలపై విజయశాంతి మౌనం దాల్చడం, పార్టీపైనే పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకానొక దశలో ఆమె పార్టీ మారబోతున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనీ ప్రచారం జరిగింది. విజయశాంతి కూడా అదే రీతిలో సంకేతాలు ఇచ్చారు. కానీ, ఆ పని జరగలేదు. అక్కడా.. ఇక్కడా ఆమెకు టికెట్ లేదనే చెప్పొచ్చు. చివరకు ఆమె ఈ సారి అసెంబ్లీ బరిలో దిగడం లేదనేది సుస్పష్టం.

Also Read: Telangana Assembly Election: బరిలో నిలిచిన వారు వీరే..ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో నియోజక వర్గాల వారిగా జాబితా..

బీజేపీ శుక్రవారం 14 మందితో అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసింది. అంతకు ముందే 100 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తాజాగా విడుదలైన 14 మంది జాబితాలోనూ మూడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉన్నది. కాగా, మిగిలిన 8 స్థానాలను జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగుస్తుందన్న విషయం తెలిసిందే.

click me!