కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రం నిఘా: విజయశాంతి కామెంట్స్

By telugu teamFirst Published Jul 11, 2019, 1:27 PM IST
Highlights

ప్రభుత్వ అవినీతిని ప్రతిపక్షాలు ఆధారాలతోసహా బయటపెట్టినా కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని విజయశాంతి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్‌: నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడం శుభపరిణామమని తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఐదేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అక్రమాలు పెరిగిపోయాయని ఆమె అన్నారు. 

ప్రభుత్వ అవినీతిని ప్రతిపక్షాలు ఆధారాలతోసహా బయటపెట్టినా కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని విజయశాంతి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసులు పెడతామని కేసీఆర్ ప్రభుత్వం బెదిరించిందని, ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పాలనపై కేంద్రం నిఘా పెట్టిందని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవకతవకలపై సమాచారం సేకరిస్తుందని బీజేపీ నేతలు ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రజలు మంచి పరిణామంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

ఏం చేసినా అడిగే నాథుడు లేడన్న బరితెగింపుతో వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను కట్టడి చేసే రోజు కోసం ప్రజానీకం ఎదురుచూస్తోందని అన్నారు. కేవలం నిఘాతో సరిపెట్టకుండా టీఆర్‌ఎస్‌ పాలనలో అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. అప్పుడే బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆడుతున్న నాటకానికి తెరపడుతుందని ఆమె అన్నారు.  

click me!