
హైదరాబాద్ : ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు సతమతం అవుతుంటే హైదరాబాద్ వాతావరణ కేంద్రం బాంబ్ పేల్చింది. రానున్న మూడురోజులు అంటే జూలై 25 నుండి 27వరకు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని హెచ్చరించారు. కొన్ని జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు.
రేపు(మంగళవారం) మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. దీంతో ముందుగానే అప్రమత్తమైన జిహెచ్ఎంసి అధికారులు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. వర్షసూచన నేపథ్యంలో స్కూళ్లకు మళ్ళీ సెలవులు ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, జనగాం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో కూడా అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. సంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్,కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read More తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. జలకళను సంతరించుకున్న నీటి పారుదల ప్రాజెక్టులు
ఇక ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో పాటు కొన్ని చోట్ల పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, వాగులువంకలు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ ఉదృతికి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రాష్ట్రంలోని పలు గ్రామాలను కూడా వరదనీరు చుట్టుముట్టి రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో హుస్సేన్ సాగర్ లోకి భారీ ఎత్తున నీరు వస్తుంది. ఎఫ్టీఎల్ 513. 41 మీటర్లు కాగా.. 513.62 మీటర్లకు సాగర్ నీటిమట్టం చేరింది. హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. 3 తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు నీళ్లను వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.దీంతో హుస్సెన్ సాగర్ కాలువల వెంట లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు.