
తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి ఈ మధ్య దోస్తీ బాగానే కుదురింది. ఇటీవల హైదరాబాద్ శివార్లలో స్వర్ణభారతి ట్రస్టు ప్రారంభ సమయంలో, అంతకుముందు జీయర్ సభలోనూ ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం గుప్పించుకున్న విషయం తెలిసిందే.
నోట్ల రద్దు అనంతరం ప్రధానమంత్రి మోదీకి అండగా నిలబడి ఆయనకు మద్దతు పలికిన మొదటి ఎన్డీయేతర సీఎం కేసీఆర్. అందుకే మోదీ స్వయంగా కేసీఆర్ ను ఢిల్లీకి పిలిపించి ఆయనతో నోట్ల రద్దు పరిణామాలపై చర్చించారు. కేసీఆర్ కూడా ప్రధాని స్ఫూర్తితో సిద్ధిపేటలోని ఇబ్రహింపూర్ గ్రామాన్ని క్యాష్ లెస్ విలేజ్ గా మర్చారు.
అప్పటి నుంచి కారు, కమలం పరస్పరం సహకరించుకుంటూనే ఉన్నాయి. ఓ దశలో కేంద్ర మంత్రి వర్గంలో టీఆర్ఎస్ పార్టీ చేరుతోందని టాక్ కూడా వినిపించింది.
దీంతో రాష్ట్రంలో కమలనాథులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయడమే లేదు. ఏదో ప్రతిపక్షంగా ఉన్నాంకాబట్టి అని అప్పుడప్పుడు గళం విప్పుతున్నారు.
ఇటీవల భద్రాచలంలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో కూడా వచ్చే 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలి లేదంటే రెండో ఆప్షన్ గా టీఆర్ఎస్ తో కలసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
అందుకే టీఆర్ఎస్ పై రాష్ట్ర బీజేపీ నేతలు పెద్దగా విమర్శలు చేయడమే లేదు. ఇక టీఆర్ఎస్ నేతలు కూడా కేంద్ర వైఖరిపై అదే ధోరణిలో వెళుతున్నారు.
ఇలా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కలసి షికారు చేస్తున్న పార్టీలు పరస్పరం ఎందుకు ఢీ కొట్టుకుంటాయి చెప్పండి. అందుకే కర్ర విరక్కూడదు పాము చావకూడదు అనే తరహాలో వెంకయ్యనాయుడు ఇటీవల టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.
గత ఎన్నికల్లోనే టీఆర్ఎస్ పార్టీ ముస్లింల రిజర్వేషన్లపై వాగ్దానం చేసింది. అధికారంలోకి వస్తే ముస్లింల స్థితిగతులపై కమిటీ వేసి రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించింది. అనుకున్నట్లే కమిటీ వేసింది. ఆ కమిటీ నిర్ణయం మేరకు రిజర్వేషన్లు పెంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అయితే గతంలోనే కోర్టులు రిజర్వేషన్ల పెంపుదలను నిలిపివేస్తూ తీర్పులిచ్చాయి. ఒక వేళ సీఎం రిజర్వేషన్ల పెంపుపై ఆమోదం తెలిపినా అది కచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఈ విషయం కేంద్ర మంత్రికి తెలియనది కాదు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఓటు బ్యాంకు రాజకీయలను నిలుపుకోవాలంటే ఎక్కడికి వెళ్లినా తమ సిద్దాంతాలకు వ్యతిరేకత ఉన్న అంశాలపై స్వరం పెంచాల్సిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్య అదే చేశారు. మత పరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని అలాంటి వాటికి కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని స్పష్టం చేశారు. ఇప్పుడావ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ లో ఉన్న తమ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేస్తాయన్నది ఆయన ఉద్దేశం తప్పితే కేసీఆర్ ను ఇరుకన పెట్టాలనే తాపత్రయం ఎంతమాత్రం కాదు అనేది సుస్పష్టం.
గతంలో వెంకయ్య నాయుడు వాగ్దాటిని ప్రశంసిస్తూ సీఎం కేసీఆర్ ఓ మాట అన్నారు. ‘ వెంకయ్య మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడిన చీపురు పుల్లతో లాఠీ చార్జ్ చేసినట్లే ఉంటుంది’ అని... ఇప్పుడు వెంకయ్య తీరు సీఎం కేసీఆర్ పై అలానే ఉంది.