3 నిమిషాల ముందు వెళ్లి, 5 నిమిషాల్లోనే వామన్ రావు దంపతుల హత్య

By telugu teamFirst Published Feb 24, 2021, 8:30 AM IST
Highlights

వామన్ రావు దంపతుల హత్యకు వేసిన పథకాన్ని అమలు చేయడానికి నిందితులకు మొత్తం 2 గంటల సమయం పట్టినట్లు అర్థమవుతోంది. కేవలం 3 నిమిషాల ముందే నిందితులు కల్వచర్ల వద్దకు చేరుకుని మాటు వేశారు.

పెద్దపల్లి: లాయర్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్యలకు నిందితులు రెండు గంటల్లో పథక రచన చేసి అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు, తర్వాత జరిగిన సంఘటనలను నిందితుల రిమాండ్ కేస్ డైరీలో పోలీసులు వివరించారు. వామన్ రావు దంపతుల కన్నా కేవలం 3 నిమిషాల ముందు నిందితులు కుంట శ్రీను, చిరంజీవి నల్ల బ్రీజా కారులో వెళ్లి కల్వచర్ల వద్ద మాటు వేసినట్లు సిసీటీవి ఫుటేజీలను బట్టి అర్థమవుతోంది. కేవలం ఐదు నిమిషాల్లో ఇద్దరిని హత్య చేసి వారు మంథని వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2.26 గంటలకు పన్నూర్ క్రాస్ రోడ్డు నుంచి నిందితుల కారు కల్వచర్ల వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం 2.29 గంటలకు వామన్ రావు దంపతుల కారు కల్వచర్లకు చేరింది. మధ్యాహ్నం 2.41 గంటలకు హత్య జరిగిన తర్వాత నిందితులు కారులోనే మంథనికి వెళ్తున్నట్లు తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. అంటే కొద్ది నిమిషాల్లోనే వామన్ రావు దంపతుల హత్య జరిగినట్లు అర్థమవుతోంది. మొత్తంగా ప్రణాళికను అమలు చేయడానికి రెండు గంటలు పట్టింది.

Also Read: వామన్ రావు దంపతుల హత్య కేసు: చంపి, రాత్రంతా కారులోనే నిద్రపోయి..

హత్యకు గ్రామంలోని కక్షలే కారణమని నిందితులు పోలీసులతో చెప్పారు. దీంతో మంథని మండలం గుంజపడుగులో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు ఉపయోగించిన కత్తులు తయారు చేసిన బాబు, రఘు, శ్రీనులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు కుంట శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ లను భద్రతాపరమైన కారణాలతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. 

వామన్ రావు కారులో పోలీసులు పలు రికార్డులు, పదుల కొద్దీ ఫిర్యాదు పత్రాలు, సమాచార హక్కు దరఖాస్తులు లభించాయి. వాటిలోని మంథని ఎంపీడీవో, తాహిసిల్దార్లకు, గుంజపడుగు పంచాయతీ కార్యదర్శికి ఆర్టీఐ కింద దరఖాస్తు పత్రాలు ఉన్నాయి. 

గుండపడుగులో ఆయుత చండీయాగం కోసం బందోబస్తు కోరుతూ వామన్ రావు తమ్ముడు చంద్రశేఖర్ పేరుతో రాసిన వినతిపత్రాలు కూడా లభించాయి. అంతా సజావుగా సాగి ఉంటే ఈ మంగళ, బుధవారాల్లో ఆయుత చండీయాగం జరిగి ఉండేది. వాట్సప్ గ్రూపులో తమపై వెల్లి వసంతరావు తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని చంద్రశేఖర్ పేరుతో 24 పేజీల ఫిర్యాదు పత్రాలు లభించాయి. 

వామన్ రావు, నాగమణి దంపతులను కల్వచర్ల గ్రామం వద్ద నిందితులు మాటు వేసి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

click me!