వైరల్.. యాదాద్రిలో ‘హెలికాప్టర్’కి వాహనపూజ.. నెట్టింట్లో తెలంగాణ వ్యాపారవేత్త ఫొటోలు హల్ చల్.. అతనెవరంటే..

By SumaBala BukkaFirst Published Dec 16, 2022, 10:09 AM IST
Highlights

హైదరాబాద్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బోయినపల్లి శ్రీనివాసరావు తాను కొత్తగా కొన్న హెలికాప్టర్ కు యాదాద్రిలో వాహనపూజ చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

హైదరాబాద్ : కొత్త బైక్‌లు, కార్లు, బస్సులు, లారీలు, ఇతర వాహనాలకు వాహనపూజ చేయించడం సర్వ సాధారణం. అలా చేయకపోతే బలి కోరుతుందని, యాక్సిడెంట్లు అవుతాయని నమ్ముతారు. అందుకే తప్పనిసరిగా పూజ చేయించిన తరువాత బండిని రోడ్డెక్కిస్తుంటారు. అలా ఓ వ్యాపారవేత్త తాను కొత్తగా కొన్న హెలికాప్టర్ ను యాదాద్రికి తీసుకువచ్చి వాహనపూజ చేయించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. 

హెలికాప్టర్‌కు వాహన పూజ చేసిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బుధవారం ఉదయం పెద్దగుట్టలో ఎయిర్‌బస్‌ ఏసీహెచ్‌-135 హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవడంతో అక్కడి స్థానికులు, అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతిమ హాస్పిటల్స్‌ గ్రూప్‌ అధినేత, హైదరాబాద్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బోయినపల్లి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో సహా అందులో నుంచి దిగారు. 

నల్గొండ జిల్లా ఇనుపాముల వద్ద రోడ్డు ప్రమాదం: కారు దగ్దం, ఇద్దరు మృతి

అర్చకుల మంత్రోచ్ఛారణలతో శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా ఉదయం 10.30 గంటల ప్రాంతంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హెలికాప్టర్‌ ముందు ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు అరగంట పాటు ఈ పూజలు జరిగాయి. పూజ చేసిన ఒక పూజారి మాట్లాడుతూ "దక్షిణాదిలో, ప్రజలు కొనుగోలు చేసిన ప్రతి కొత్త వాహనానికి 'వాహన పూజ' చేయడం ఒక సాధారణ ఆచారం. చెడు దృష్టి నుంచి తప్పించుకోవడానికి, వాహన యజమాని సురక్షితంగా ఉండడానికి ఈ పూజలు జరుగుతాయి" అని చెప్పారు. 

హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రిలో హెలికాప్టర్‌కు వాహన పూజ మొదటిసారిగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి గర్భాలయం ఉన్న ప్రధాన గుట్టకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండో గుట్టపై యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ తాత్కాలిక హెలిప్యాడ్‌ను నిర్మించింది. యాదాద్రి ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ఈ హెలిప్యాడ్‌ను నిర్మించారు.

ఛాపర్‌ను కొనుగోలు చేసిన శ్రీనివాసరావు మహారాష్ట్ర మాజీ గవర్నర్, సీనియర్ బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు బంధువు, ఆయన కూడా ఈ పూజకు హాజరయ్యారు. పూజల అనంతరం కుటుంబ సభ్యులు కొండ గుడి చుట్టూ హెలికాప్టర్‌లో ఒక రౌండ్ వేసి, పూజలు చేశారు. ప్రతిమ గ్రూప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం రంగాలలో ఉంది. మరియు మెడికల్ కాలేజీ, చైన్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. 

click me!