తెలంగాణ వ్యవసాయ విధానం భేష్..: మంత్రి సింగిరెడ్డితో మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు భేటీ, కీలక సూచనలు

Arun Kumar P   | Asianet News
Published : May 22, 2022, 01:51 PM IST
తెలంగాణ వ్యవసాయ విధానం భేష్..:  మంత్రి సింగిరెడ్డితో మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు భేటీ, కీలక సూచనలు

సారాంశం

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వర రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాన్ని ఆయన ప్రశంసించారు. 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖా మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు (vadde shobhanadrishwar rao) ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) రైతులకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. 

ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjan reddy) తో మాజీ మంత్రి శోభనాద్రీశ్వర రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు మద్దతిస్తున్న తీరు భేష్ అని ప్రశంసించారు.  అయితే వ్యవసాయం, పంటల సాగు విషయంలో రాష్ట్ర  ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలిచ్చారు శోభనాద్రీశ్వర రావు. 

పంటల వైవిధ్యీకరణ తప్పనిసరిగా పాటించాలని... వరి సాగు నుండి పప్పు, నూనె గింజల సాగు వైపు రైతులను మళ్లించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. 1985 - 1989 మధ్యకాలంలో నూనెగింజలు - అపరాల సాంకేతిక మిషన్ పథకం తరహాలో ప్రస్తుతం అపరాలు, నూనె, పప్పుగింజల సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శోభనాద్రీశ్వర రావు సూచించారు. 

వ్యవసారం రంగంలోనూ విదేశీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన వసతులు కల్పించాలని మంత్రి సింగిరెడ్డికి శోభనాద్రీశ్వర రావు సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి అధిక ధర పొందడానికి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చాలా అవసరమని... ఇందుకోసం మహిళా రైతులు, ఉత్పత్తి సంస్థలకు సహకారం అందించాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మద్దతుధరల విషయంలో అవలంబిస్తున్న లోపభూయిష్ట విధానాల మూలంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తులకు c2 + 50 ఫార్మూలా ప్రకారం కనీస మద్దతుధర లభించేలా చట్టబద్దత కల్పించినపుడే రైతులకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. 

ప్రపంచ వాణిజ్య సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తుంటాయి... కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకుని మన దేశ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉన్న నియమాలలో మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా డంకెల్ డ్రాఫ్ట్ రచించుకుని ఆయా దేశాల ఉత్పత్తులకు అధిక ధరలు వచ్చేలా, ఆయా దేశాల రైతులు లాభపడేవిధంగా విధానాలు రూపొందించుకున్నారని శోభనాద్రీశ్వరరావు తెలిపారు. 

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు మద్దతుధర ఇవ్వొద్దని, మద్దతుధర ఇచ్చే ఉత్పత్తులు కొనుగోలు చేయమని, రైతులకు సబ్సిడీలు ఇవ్వొద్దని ఆంక్షలు విధిస్తున్నారని గుర్తుచేసారు. దీనివల్ల దేశ వ్యవసాయరంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం రైతుల తరపున పోరాడకుండా వారి నడ్డివిరిచే కొత్తకొత్త వ్యవసాయ చట్టాలు తెస్తూ కార్పోరేట్ల కొమ్ముగాస్తోందని... ఇలా దేశ వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తుండడం దురదృష్టకరమని మాజీ మంత్రి అన్నారు. 

తాను మీ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లాలని మంత్రి సింగిరెడ్డిని శోభనాద్రీశ్వర రావు కోరారు. తానే స్వయంగా సీఎంను కలిసి ఈ విషయాలు వెల్లడించవచ్చని... కానీ అందుకు సమయం కుదరకపోవడం, ఆరోగ్యం సహకరించకపోవడం వంటివి అడ్డుపడుతున్నాయని అన్నారు. తన సలహాలు, సూచనలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు శోభనాద్రీశ్వర రావు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం