ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైనంపల్లి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ రెండేసి టిక్కెట్లను కేటాయించింది.
హైదరాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ రెండు టిక్కెట్లను కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావు ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కూడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయన భార్యకు కాంగ్రెస్ పార్టీ రెండు అసెంబ్లీ టిక్కెట్లను కేటాయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు ఉదయం విడుదల చేసింది. 55 మందితో అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉదయం విడుదల చేసింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన భార్య పద్మావతికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను కేటాయించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడ హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుండి పద్మావతికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది. హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. కోదాడ నుండి పోటీ చేసిన పద్మావతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
undefined
గత మాసంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి టిక్కెట్టు కేటాయించింది. మెదక్ నుండి హన్మంతరావు కొడుకు రోహిత్ రావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ టిక్కెట్టును కేటాయించింది. అయితే తన కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ కేటాయించింది. దీంతో ఆయన బీఆర్ఎస్ ను వీడారు. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలమైన హామీ రావడంతో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇచ్చిన హామీ మేరకు మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించింది.
ఇక జానారెడ్డి కుటుంబం కూడ రెండు టిక్కెట్లను ఆశిస్తుంది. నాగార్జునసాగర్ నుండి జానారెడ్డి పెద్ద కొడుకు జయవీర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టును కేటాయించింది. మిర్యాలగూడ నుండి చిన్న కొడుకు రఘువీర్ కు టిక్కెట్టును కేటాయించాలని కోరుతున్నారు. అయితే పొత్తు కారణంగా మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎం కోరుతుంది. దీంతో మిర్యాలగూడ టిక్కెట్టు జానారెడ్డి కుటుంబానికి కేటాయిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల సమయంలో కూడ నాగార్జునసాగర్ తో పాటు మిర్యాలగూడ టిక్కెట్టును జానారెడ్డి కోరారు. అయితే చివరినిమిషంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. దీంతో జానారెడ్డి మాత్రమే నాగార్జున సాగర్ నుండి పోటీ చేయాల్సి వచ్చింది.
also read:55 మందితో తెలంగాణ కాంగ్రెస్ జాబితా: ఫస్ట్ లిస్ట్ ఇదే..
మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించడం ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను భిన్నంగా జరిగిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఒకే కుటుంబంలో రెండో టిక్కెట్టు కేటాయించే విషయంలో కొన్ని నిబంధనలను రూపొందించారు. కనీసం ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే గత నెలలోనే కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. అయితే పార్టీ అగ్రనేతలు రాహుల్, సోనియాల నుండి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉదయ్ పూర్ డిక్లరేషన్ పక్కన పెట్టి టిక్కెట్ల కేటాయింపు చేసే వెసులుబాటు కూడ ఉందని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.