టీఆర్ఎస్ నిర్లక్ష్యం... 61 మందిని బలి తీసుకుంది: ఉత్తమ్

By Arun Kumar PFirst Published Sep 14, 2018, 11:18 AM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం 61 మందిని బలి తీసుకుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగిన  స్థలాన్ని ఆయన సందర్శించారు

టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం 61 మందిని బలి తీసుకుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగిన  స్థలాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మరణించిన వారి కుటుంబ సభ్యులను గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.

తిమ్మాయిపేటలో కాంగ్రెస్ నేత జి. సుమలత కుటుంబాన్ని పరామర్శించి.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో 11 మంది ఈ గ్రామానికి చెందిన వారే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బస్సు ప్రయాణానికి ఫిట్‌గా లేదని తెలిసి కూడా దానిని అనుమతించారని.. ఇప్పటికే 14 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సు ఏ విధంగానూ రవాణాకు పనికిరాదన్నారు.

పరిమితికి మించి ప్రజలను ఎత్తుకోవడం కూడా ప్రమాదానికి కారణమైందని ఉత్తమ్ అన్నారు.. అన్ని కలిసి తెలంగాణలోనే అతిపెద్ద విషాదానికి కారణమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఏ మూలకు సరిపోదని..మరణించిన ఒక్కొక్కరికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఈ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం, టీఎస్‌ఆర్టీసీ కలిసి భరించాలని అన్నారు.

అంతేకాకుండా మూడు నెలల్లోగా బాధిత కుటుంబాల్లోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. బాధితులందరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న ఆయన ... పార్టీ తరపు నుంచి రూ.25,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంటన ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎస్సీ సెల్ ఛైర్మన్ ఆరేపల్లి మోహన్ ఉన్నారు.

click me!