గాంధీ హాస్పిటల్ లో మృతదేహాన్ని వదిలివెళ్లిన అగంతకులు.. హత్య చేసి, డెడ్ బాడీనీ ఆటోలో తీసుకొచ్చి...

By SumaBala Bukka  |  First Published May 15, 2023, 2:32 PM IST

గాంధీ ఆస్పత్రిలో కొందరు ఓ వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లారు. ఆరు రోజుల తరువాత ఈ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అది హత్యగా గుర్తించారు. 


హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో ఈ నెల 9వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ కేసు  స్థానికంగా కలకలం రేపింది. దీని మీద సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. దాదాపు 200కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన తర్వాత ఆ మృతదేహం జితేందర్ అనే వ్యక్తిదిగా గుర్తించారు.

డబ్బుల విషయంలో ఓ వ్యక్తితో జరిగిన గొడవలో అతడిని కొట్టి చంపినట్లుగా.. ఆ తర్వాత మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తీసుకువచ్చి వదిలేసి వెళ్లినట్టుగా గుర్తించారు. దీంతో ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి..  మే 9వ తేదీ అర్ధరాత్రి 1.40 గం.లకు  మిగతాజీవిగా ఉన్న ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు స్ట్రెచర్ మీద తీసుకువచ్చారు.

Latest Videos

ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది.. : కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ

ఆ తర్వాత ఓపి చిట్టి తీసుకువస్తామని చెప్పి అక్కడి నుంచి పారిపోయారు. స్ట్రెచర్ పై ఉన్న వ్యక్తిని కొద్దిసేపటి తర్వాత అక్కడి  క్యాజువాలిటీ డాక్టర్లు పరీక్షించారు. అతను అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. అతనికి సంబంధించిన వ్యక్తుల గురించి వెతకగా వారు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారి సమాచారం మేరకు పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడి ముఖం, చేతులు, తల మీద గాయాలు ఉన్నాయి. అతడి వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉంటుందని కుడి చేతి మీద ‘జితేందర్-కుషి’ అని హిందీలో పచ్చబొట్టు ఉందని  పోలీసులు తెలిపారు. దీన్నిబట్టి అతను ఒడిశా లేదా బెంగాల్ కు చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుమానించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గాంధీ హాస్పిటల్ నుంచి గచ్చిబౌలి వరకు ఉన్న దాదాపు 200 సీసీటీవీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలించారు.

మృతుడు భవన నిర్మాణ కార్మికుడై ఉంటాడని.. ఈ ప్రాంతంలో ఏదైనా నిర్మాణాల్లో ఉన్న భవనంలో పనిచేస్తుండొచ్చని అనుమానించారు.  తోటి కూలీలతో జరిగిన గొడవతోనే ఈ హత్య జరిగి ఉంటుందని సందేహిస్తున్నారు. ఆదివారం చిలకలగూడ పోలీసులు మృతదేహాన్ని వెంట తీసుకొచ్చిన వ్యక్తి ఫోటోను విడుదల చేశారు. 

గచ్చిబౌలిలో జితేందర్ అనే వ్యక్తి మీద ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించినట్లుగా సీసీటీవీ ఫుటేజీ రికార్డులను బట్టి అంచనాకు వచ్చారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లుగా నిందితుడు గమనించడంతో గాంధీ హాస్పిటల్ నుంచి పరారయ్యాడు. హాస్పిటల్ కి వచ్చిన ఆటోడ్రైవర్ కి గూగుల్ పే తో డబ్బులు ఇచ్చాడు. ఈ నెంబరు ఆధారంగా  కేసును దర్యాప్తు చేశారు. నిందితులను గుర్తించారు. 

తపన్ అనే వ్యక్తి జితేందర్ తో డబ్బుల విషయంలోనే గొడవపడి, కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత చిలకలగూడ పోలీసులు ఈ హత్య కేసును గచ్చిబౌలి పోలీసులకు బదిలీ చేశారు.  ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు  కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం వెతుకుతున్నారు. 

click me!