కేసీఆర్, కవితలను ఎందుకు అరెస్ట్ చేయలేదు: డీజీపీని ప్రశ్నించిన కిషన్ రెడ్డి

By Siva KodatiFirst Published Dec 14, 2020, 4:44 PM IST
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.

ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో ఢిల్లీలో కేసీఆర్ ఏమి మాట్లాడారో ఆయన్నే అడగాలంటూ కిషన్ రెడ్డి విలేకర్లకు బదులిచ్చారు. టీఆర్ఎస్ చేసింది రైతుల బంద్ కాదు.. సర్కారీ బంద్ అంటూ ఆయన అభివర్ణించారు.

భారత్ బంద్‌లో పాల్గొన్న కేసీఅర్, కవితలను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ చెప్పాలని కిషన్ రెడ్డి నిలదీశారు. బీజేపీ చేసే నిరసనలకు సైతం పోలీసులు సహకరించాలని ఆయన కోరారు.

భారత్ బంద్‌లో స్వయంగా మంత్రులు పాల్గొనటం సిగ్గుచేటని.. రాజకీయంగా మోడీని ఎదుర్కోలేకనే వ్యవసాయ చట్టాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ఆరోపించారు.

సీడ్ డెవలప్‌మెంట్ కోసం సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో ఐటీసీ కంపెనీ ఏర్పాటు చేశామని... ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులను ప్రోత్సహిస్తామని, వేర్ హౌసింగ్‌ల కోసం తెలంగాణకు నిధులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు.

రైతులకు నష్టం చేసే చర్యలను కలలో కూడా బీజేపీ ప్రభుత్వం చేయదని.. రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు అడ్డుకున్నా మేము అనుకున్నది చేసి తీరుతామని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవటం బాధాకరమని... 70 ఏళ్ళుగా కుదేలైన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. రైతు ఉద్యమం పంజాబ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని.. రైతుల దగ్గరకు వెళ్ళి వ్యవసాయ చట్డంపై వాస్తవాలు చెప్పాలని నిర్ణయించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రైతులకు అవగాహన కల్పించటం కోసం కిసాన్ టీవీ ఛానల్ తీసుకొస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యువత వ్యవసాయ రంగం వైపు వెళ్ళేలా చేస్తామని.. రైతులకు విద్యుత్ కోతలు, ఎరువుల కొరత లేకుండా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

కిసాన్ బ్రాండ్ పేరుతో రామగుండం పరిశ్రమ నుంచి తెలంగాణ, ఏపీ రైతులకు యూరియా అందించబోతున్నట్లు తెలిపారు. ఒన్ నేషన్..‌ ఒన్ గ్రిడ్‌తో రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. 

click me!