పాతబస్తీని ఒకరు.. న్యూసిటీని మరొకరు: ఒవైసీ, కల్వకుంట్ల ఫ్యామిలీలపై కిషన్ రెడ్డి విమర్శలు

By Siva KodatiFirst Published Nov 8, 2020, 2:59 PM IST
Highlights

హైదరాబాద్ మునిగిపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం సికింద్రాబాద్‌లో మాట్లాడిన ఆయన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని కిషన్ రెడ్డి ఆరోపించారు

హైదరాబాద్ మునిగిపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం సికింద్రాబాద్‌లో మాట్లాడిన ఆయన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

అసలు ఎన్ని ఇళ్లు ఇచ్చారో ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు నీళ్లెందుకు ఇవ్వలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రూ.10 వేల వరద సాయం కూడా టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి పోతున్నాయని ఆయన ఆరోపించారు.

వరదల్లో చనిపోయిన కుటుంబాలను పరామర్శించే సమయం కూడా కేసీఆర్‌కు లేదా అని కేంద్ర మంత్రి నిలదీశారు. పాతబస్తీని ఒవైసీలు.. న్యూసిటీని కల్వకుంట్ల కుటుంబాలు పంచుకున్నాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మజ్లీస్ పార్టీ రౌడీయిజంతో భూముల్ని ఆక్రమించుకుంటోందని.. చివరికి మెట్రో రైలుని కూడా పాతబస్తిలోకి రానివ్వలేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా ఎంఐఎం నేతలే ఉన్నప్పటికీ పాతబస్తీలోకి మెట్రో రైలు ఎందుకు తీసుకెళ్లలేకపోయారని కిషన్ రెడ్డి నిలదీశారు.

కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా రూ.3,500 కోట్ల ప్రజాధనాన్ని ఎల్ అండ్ టీ కంపెనీకి ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. కరోనా బారినపడి వందలాది మంది చనిపోయారని.. కానీ ఏ ఒక్క ఆసుపత్రికైనా కేసీఆర్, కేటీఆర్‌లు వెళ్లి పరామర్శించారా అని ఆయన నిలదీశారు.

నరేంద్రమోడీ పేదల కోసం పంపిన కందిపప్పును పంపిణీ చేయని కారణంగా రాష్ట్రంలోని వివిధ గోడౌన్లలో కందిపప్పు, శనగపప్పు, శెనగలు పురుగు పట్టిపోతున్నాయని.. ప్రజలకు ఎందుకు వాటిని పంపిణీ చేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

శెనగలు పంచితే నరేంద్రమోడీకి పేరు వస్తుందనే భయంతోనే వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. ఆరు సంవత్సరాల పాలనలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయలేదని .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన రేషన్ కార్డులే ఇంకా వున్నాయని ఆయన దుయ్యబట్టారు.

రేషన్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా వుండటం, మళ్లీ ఇక్కడ కూడా మోడీకి పేరొస్తుందనే అక్కసుతోనే కేసఆర్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ప్రింట్ చేయడం లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఉద్యమానికి బలమైన కారణాల్లో ఒకటైన నియామకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని.. కానీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని ఆయన మండిపడ్డారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోలేదని... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలను ఓట్లు వేసే హక్కు లేదన్నారు.

ఎంఐఎం పార్టీ బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాలను గెలుచుకుందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంతృత్వ పాలన పోయి.. ప్రజాస్వామ్య పాలన రావాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. 

click me!