ఎర్రబస్సు తప్ప ఏం తెలియదు: తెలుగు ప్రజలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 18, 2020, 8:18 PM IST
Highlights

తెలుగు ప్రజలపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. తెలుగువారికి ఎర్ర బస్సులు తప్ప ఏం తెలియవంటూ వ్యాఖ్యానించారు. 

తెలుగు ప్రజలపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. తెలుగువారికి ఎర్ర బస్సులు తప్ప ఏం తెలియవంటూ వ్యాఖ్యానించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎర్రబస్సు తప్ప రైలంటనే తెలియదన్నారు. రైలు ప్రయాణం అలవాటు లేని ప్రజలకు రైలు మార్గాలను మోడీ తీసుకొచ్చారని కిషన్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 427 రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్ వైఫె సౌకర్యాన్ని అందించామన్నారు.

Also Read:కేసీఆర్ అండతోనే ఎంఐఎం రెచ్చిపోతోంది: భైంసాలో కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర బస్సు తప్ప రైల్వే సౌకర్యం లేదని.. అలాంటి చోట మోడీ కొత్త రైల్వే మార్గాలను ప్రారంభించారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.     

గత ఆదివారం నిర్మల్ జిల్లా భైంసాలో పర్యటించిన కిషన్ రెడ్డి.. అధికార టీఆర్ఎస్ అండదండలతోనే మజ్లిస్ పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని ఆరోపించారు. కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల బారి నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన నిధులపై కేసీఆర్, కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్రమంత్రి సవాల్ విసిరారు. సబ్సిడీ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం రూ.28 భరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2 మాత్రమే భరిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

Also Read:మజ్లీస్ తో కలిసి టీఆర్ఎస్ కుట్ర: పాతబస్తీ మెట్రోపై కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా రైతులకు ఎకరానికి రూ.6 వేలు ఇస్తుంటే.. కేసీఆర్, కేటీఆర్‌లకు కనిపించడం లేదా అని మంత్రి నిలదీశారు. గల్లీలకు పరిమితమైన ఎంఐఎం అల్లర్లను భైంసా వరకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. అల్లర్ల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. ఈ ప్రాంతం చాలా సున్నిత ప్రాంతమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బాధితులకు నష్టపరిహారం వచ్చేలా చూస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా కేంద్రమంత్రిగా ఒక నెల జీతాన్ని భైంసా బాధితులకు ఇస్తానని ప్రకటించారు. ఓ గిరిజన బిడ్డను ఆదిలాబాద్ ప్రజలు ఎంపీగా గెలిపించడం శుభ పరిణామం అని ఆయన వ్యాఖ్యానించారు.     

click me!