
బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శనివారం సికింద్రాబాద్ వారసిగూడలో జరిగిన ప్రజాగోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో ఎవరైనా నాయకులు ఖాళీగా వుంటే వారికి డబ్బులు ఇచ్చి బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా వుండే నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు శాపమని.. మోడీపై లేనిపోని విష ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోపిడి చేసుకుని ఫామ్‌హౌజ్‌లు కడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నాడని.. రాష్ట్రంలో ఏ మాఫియాలో చూసినా కేసీఆర్ కుటుంబం పేరే వుందని ఆయన ఆరోపించారు. బంగారు తెలంగాణను తెస్తానని చెప్పిన కేసీఆర్ ఆయన కుటుంబాన్ని మాత్రం బంగారం చేసుకున్నాడని కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రగతి భవన్, విమానలు కొంటారని, తెలంగాణ ప్రజల డబ్బు దోచుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
Also REad: కూలుస్తానన్నది నువ్వే .. తాను చెప్పింది పాతబస్తీ గురించి : కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
ఇకపోతే.. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పాత సెక్రటేరియట్ ఇంకా వందేళ్లు వుండేదని, దానిని ఎందుకు కూల్చారని ఆయన ప్రశ్నించారు. సెక్రటేరియట్‌కు రాని కేసీఆర్ దానిని ఎందుకు కూల్చాల్సి వచ్చిందని బండి సంజయ్ నిలదీశారు. పేదలకు ఉపయోగపడే ఉస్మానియాను ఎందుకు కూల్చి కొత్తది కట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కూలుస్తా అన్నది నువ్వే కేటీఆర్ అంటూ..తాను పాతబస్తీ నుంచే ప్రారంభించమన్నానని బండి సంజయ్ గుర్తుచేశారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు కట్టనిది వాస్తవమేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కోట్ల నష్టం వచ్చిందని రిపోర్ట్‌లే చెప్పాయని.. బానిసత్వ మరకలు చెరిపేయాలని తాము చూస్తున్నామన్నారు. నిజాం మరకలు ఇంకా వుండాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
బడ్జెట్‌పై ఎక్కడా చర్చ లేదని.. సీఎం మాటపై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. కేంద్రం, మోడీని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లుందని సంజయ్ దుయ్యబట్టారు. పోడు భూముల పట్టాల పంపిణీపై మళ్లీ కొత్త లింకు పెట్టారని.. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. బోయ వాల్మీకీలను ఎందుకు ఎస్టీలలో చేర్చలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున లేనిపోని హామీలు ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.