కేసీఆర్ అడ్డాలో బీజేపీ జెండా: దుబ్బాక విజయంపై కిషన్ రెడ్డి స్పందన

By Siva KodatiFirst Published Nov 10, 2020, 8:33 PM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల తెలంగాణలోని ప్రతి గ్రామంలోని ఉన్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల తెలంగాణలోని ప్రతి గ్రామంలోని ఉన్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ గెలుపును రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉద్యమ కారులు స్వాగతిస్తున్నారని చెప్పారు.

తెలంగాణలోని ప్రతి గ్రామంలోని యువకుడు తానే విజయం సాధించినట్లుగా భావిస్తున్నారని అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యుల అడ్డా అయిన దుబ్బాకలో.. అక్కడి ప్రజలు బీజేపీ జెండా పాతారని పేర్కొన్నారు.

Also Read:దుబ్బాక సౌండ్ ఇది: కేసీఆర్‌పై రఘునందన్ పంచ్‌లు

టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్ధలు కొట్టి రఘునందన్ రావుకు పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా బీహార్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగాయని.. వీటన్నింటిలో బీజేపీ అధికారంలోనే వుందని కానీ తాము ఎక్కడ దౌర్జన్యానికి, అధికార దుర్వినియోగానికి దిగలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.

బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా శాంతియుతమైన పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. తాను అనేక సంవత్సరాలుగా ఎన్నో ఎన్నికల్లో పనిచేశానని, కానీ ఇటీవల దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూడలేదన్నారు.

టీఆర్ఎస్ అవలంభించిన విధానానికి దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. స్వయంగా బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు మామ ఇంటిపై దాడి చేయడంతో పాటు రఘునందన్‌రావు కుటుంబ సభ్యులను వేధించారని ఆయన ఆరోపించారు.

బీజేపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్తే అడుగడుగునా అడ్డుకున్నారని.. అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని మండిపడ్డారు. నాయకులు, అధికారుల తీరును ప్రజలు గమనిస్తున్నారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీని చేరదీసి ఆశీర్వదించారని.. క్లిష్ట సమయంలో దేశ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని కిషన్‌రెడ్డి చెప్పారు.

click me!