మోడీ నమ్మకం నిలబెడతా.. తెలుగు ప్రజలకు మంచి పేరు తెస్తా: కిషన్ రెడ్డి

By Siva KodatiFirst Published Jul 7, 2021, 9:06 PM IST
Highlights

తనపై విశ్వాసం  వుంచిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని అంచనాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. 

తనపై విశ్వాసం  వుంచిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని అంచనాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. తనకు మార్గదర్శనం చేసిన అమిత్ షాకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా చేపట్టిన అనేక నిర్ణయాలను , అనేక రకాల చట్టాలను రూపకల్పలన చేయడంలో తన వంతు ప్రయత్నం చేశాననన్నారు.

గడిచిన రెండేళ్లలో కేంద్రప్రభుత్వం ద్వారా జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన అనిశ్చిత పరిస్ధితి, తీవ్రవాద కార్యకలాపాల మధ్య ప్రజల జీవనం కొనసాగుతున్న పరిస్ధితుల్లో ఆర్టికల్ 370ని తొలగించామన్నారు. దీనిపై భారతీయ జనసంఘ్ కాలం నుంచి పోరాటం చేస్తున్నామన్నారు. తమ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిపై హామీ ఇచ్చామన్నారు. అనంతరం సీఏఏ, హోంశాఖ నుంచి ఎన్నో బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టానని కిషన్ రెడ్డి తెలిపారు. తన జీవితంలో ఈ రెండు సంవత్సరాలు పనిచేయడం మరిచిపోలేని సంఘటన అన్నారు.

Also Read:కేంద్ర కేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్... తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేఒక్కడు , ఆయన ప్రస్థానం ఇదే

కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తాను కీలక పాత్ర పోషించానన్నారు. మంత్రిత్వ శాఖలో ప్రమోషన్, కేబినెట్ హోదా, స్వతంత్ర హోదా కావాలని తాను ఎవరిని కోరలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికీ నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు తనకు కేబినెట్ మినిస్టర్‌గా అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. తనతో పాటు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారేనని కిషన్ రెడ్డి వెల్లడించారు. సామాన్య కార్యకర్తలకు బీజేపీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.

ఏపీ, తెలంగాణలకు కేబినెట్ మంత్రిగా అందుబాటులో వుంటానని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న  జల వివాదంపైనా కిషన్ రెడ్డి స్పందించారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

click me!