మాతో సవాళ్లు అక్కర్లేదు.. జనమే ఆర్నెళ్లలో రాజీనామా చేయిస్తారు : కేటీఆర్‌కు కిషన్ రెడ్డి కౌంటర్

By Siva KodatiFirst Published Jan 7, 2023, 6:31 PM IST
Highlights

తనకు మంత్రి కేటీఆర్ సవాల్ విసరడంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లోని రక్షణ సంస్థల కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని.. మరి తెలంగాణ సర్కార్ నగర నిధులన్నీ హైదరాబాద్‌లోనే ఖర్చు చేస్తోందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
 

కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రైతు రుణమాఫీ సకాలంలో చేయడం లేదని.. వెంటనే రైతు రుణమాఫీ చేయాలన్నారు. రైతుల ఖాతా నుంచి డబ్బును బ్యాంకులు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఆరోపించారు.కేటీఆర్ మాటలు బాధ్యతరహితమైనవని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో ఎన్నో రక్షణ సంస్థలున్నాయని.. ఇందుకోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. మరి తెలంగాణ సర్కార్ నగర నిధులన్నీ హైదరాబాద్‌లోనే ఖర్చు చేస్తోందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కేటీఆర్ రాజీనామాలు చేస్తారా..? అంటూ సవాళ్లు విసరాల్సిన పనిలేదని, ఆర్నెళ్లలో తెలంగాణ ప్రజలే మీతో రాజీనామా చేయిస్తారంటూ కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటే ఉలికిపాటు ఎందుకని ఆయన ప్రశ్నించారు. దోచుకున్న డబ్బుతో బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. 

అంతకుముందు నిన్న కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల 68 వేల కోట్లు పంపామన్నారు. కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనని కేటీఆర్ దుయ్యబట్టారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. నీకు పదవికి రాజీనామా చేసే దమ్ము ఎలాగూ లేదు.. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేయలేని అసమర్ధుడివంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం తెలంగాణ ప్రజలకైనా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు ఎక్కువ అని కేటీఆర్ ఆరోపించారు. 

Also REad: ఆ మాటలు తప్పయితే నేను రాజీనామా చేస్తా.. నువ్వు క్షమాపణ చెప్పు చాలు : కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రెండు జాతీయ పార్టీలు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. పెట్టుబడి ద్వారా సంపద సృష్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని మంత్రి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా.. జెండా, ఎజెండా, మనుషులు, డీఎన్ఏ మారలేదనపి మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 

click me!