
బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ కాదని అన్నారు. ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు ముందకొస్తే.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... దేశాభివృద్దికి రహదారులు కూడా కీలకమని కేంద్ర మంత్రి అన్నారు. జాతీయ రహదారుల్లో తెలంగాణకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల (National Highways) నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. రాష్ట్రానికి కొత్తగా 2,480 కి.మీల మేర హైవేలు మంజూరు చేసినట్టుగా చెప్పారు. 60 ఏళ్లలో మంజూరు కానీ రోడ్డు ఈ ఆరేళ్లలో మంజూరు అయినట్టుగా చెప్పారు. దాదాపు అన్ని జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానం అయ్యాయని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఇప్పటికే 75 జాతీయ రహదారులు నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లపై రూ. 31,624 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రూ. 15,113 కోట్లకు సంబంధించిన పనులు ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించామని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు అవసరమయ్యే నిధులను వందశాతం కేంద్రమే భరిస్తుందని చెప్పారు.
హైదరాబాద్- బెంగళూరు మధ్య హైవేను సూపర్ ఇన్ఫర్మేషన్ హైవేగా తీర్చిదిద్దనున్నట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు.సీఆర్‌ఐఎఫ్ కింద రూ. 3,314 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇక, రాష్ట్రంలో రహదారులకు రూ. 93,656 కోట్లు కేటాయించినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. పీఎంఎస్‌జేవై కింద నిర్మించే రోడ్లు దీనికి అదనం అని చెప్పారు.