దమ్ముంటే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి : సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

By Siva KodatiFirst Published Sep 30, 2022, 3:38 PM IST
Highlights

దమ్ముంటే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బయ్యారంపై విభజన చట్టంలో ఫీజుబిలిటీ స్టడీ చేయాలని మాత్రమే వుందన్నారు మంత్రి. 

టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను, పాలనను గాలికొదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని, కేంద్రాన్ని, ప్రధాని మోడీని విమర్శించడమే ఏకైక ఏజెండాగా టీఆర్ఎస్ పెద్దలు పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం పేరుతో టీఆర్ఎస్ వీధి నాటకాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. బయ్యారంపై విభజన చట్టంలో ఫీజుబిలిటీ స్టడీ చేయాలని మాత్రమే వుందన్నారు. అక్కడ నాణ్యమైన ముడి ఖనిజం లేదని నిపుణులు తేల్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ అంశాలను కేంద్ర మంత్రి రాజ్యసభలోనే ప్రకటించారని మంత్రి వెల్లడించారు. 

తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు కావాలని.. జాతీయ పార్టీ పెడతానంటూ కేసీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణలో ఏమీ సమస్యలు లేవని.. ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా వున్నారని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్రటేరియట్‌కు సీఎం రాకుండా పరిపాలన చేయడం, వున్న సెక్రటేరియట్‌ను కూలగొట్టడం, మంత్రికి కేబినెట్‌లో స్థానం లేకుండా నడపడమా తెలంగాణ మోడల్ అంటే అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏం చూసి దేశప్రజలు మీకు స్వాగతం పలుకుతారని ఆయన నిలదీశారు. 

ALso REad:టీఆర్ఎస్ కు రూ.80కోట్లతో సొంత చార్టర్డ్ ఫ్లైట్.. దేశవ్యాప్త సుడిగాలి పర్యటనకు కేసీఆర్ రెడీ..

ప్రజలను కలవకుండా తొమ్మిదేళ్లుగా .. సగం రోజులు ప్రగతి భవన్‌లో, సగం రోజులు ఫామ్ హౌస్‌లో కేసీఆర్ కాలం గడిపారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ దొంగ మాటలు మాట్లాడుతూ.. తొండి వాదన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కట్టకపోతే తామే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కడతామని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ అన్న మాటలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పది నుంచి 15 వేల మందికి తాము ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. దమ్ముంటే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని.. తాము ఎప్పుడూ మాట ఇవ్వలేదని కిషన్ రెడ్డి అన్నారు. 
 

click me!