
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్ షా రానున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సందర్శించనున్నారు. 14న సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు అమిత్ షా రానున్నారు. 14న సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడా సభాస్థలికి హోంమంత్రి చేరుకుంటారు. అదే రోజు రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళతారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మే 14న మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సభకు అమిత్ షా రానున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై కేంద్రం, బీజేపీ రాజకీయ పోరాటం తీవ్రమవుతున్న తరుణంలో అమిత్ షా(Amit shah) రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పర్యటనలో ఆయన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శల చేస్తారు ? ఇందుకు గులాబీ బాస్ కేసీఆర్(KCR) నుంచి ఏ రకమైన రియాక్షన్ ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇకపోతే గతవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ (bandi sanjay) నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో (praja sangrama yatra) భాగంగా గత గురువారం మహబూబ్‌నగర్‌లో (mahabubnagar) జరిగిన బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరై ప్రసంగించారు. దేశంలోనే అత్యంత అవినీతివంతమైన ప్రభుత్వం కేసీఆర్‌దేనని (kcr) ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని జేపీ నడ్డా ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ (kaleshwaram project) సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజలకు చేరకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంలో అవినీతి జరగలేదా అని ఆయన ప్రశ్నించారు. అది తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రజాకార్ సమితి అంటూ ఎద్దేవా చేశారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బాధ్యతాయుతమైందని.. కరోనా సమయంలో దేశ ప్రజలను మోడీ రక్షించారని నడ్డా పేర్కొన్నారు. 190 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడం వల్లే ఈ రోజు మనమంతా ఇక్కడ మాస్క్ లేకుండా వున్నామన్నారు. కేసీఆర్ కరోనా ప్రోటోకాల్‌ను పాటించలేదని నడ్డా ఆరోపించారు. దుబ్బాక, హుజురాబాద్‌లలో బీజేపీ గెలుపుతో కేసీఆర్‌కు కష్టాలు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆయుష్మాన్‌భవ అమలు కాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని నడ్డా మండిపడ్డారు.