ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా బీజేపీ ఇందుకు ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ స్పెషల్ ఆర్గనైజర్లుగా మారాయన్నారు.
న్యూఢిల్లీ: ప్రజలు ఎన్నుకున్నప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.న్యూఢిల్లీలోని ఎఐసీసీ జాతీయనేత కేసీ వేణుగోపాల్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం నడు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారత్ జోడో యాత్రపై చర్చించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను బీజేపీ తన స్పెషల్ ఆర్గనైజర్లుగా మార్చుకొందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని తమ ప్రత్యర్ధులపై దాడులు చేయిస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రకమైన రాజకీయాలను నిరసిస్తూ సెప్టెంబర్ 4న ఢిల్లీలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున పాల్గొంటామన్నారు.
మరో వైపు సెప్టెంబర్ 7 నుండి రాహుల్ గాంధీ ప్రారంభించనున్న భారత్ జోడో యాత్రపై కూడా కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్టుగా ఆయన వివరించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాహల్ యాత్రపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ యాత్రకు సంబంధించి తమకు వచ్చిన సందేహలపై పార్టీ అగ్రనేతలపై చర్చించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ 15 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో 350 కి.మీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటారని రేవంత్ రెడ్డి చెప్పారు.
2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుందన్నారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. ప్రజల మధ్య విభజన రేఖను తీసుకొచ్చేలా బీజేపీ ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. . ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలను బలి పెట్టారన్నారు. కానీ బీజేపీ నేతలు మాతరం తమ స్వార్ధం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. అంతేకాదు పార్టీ ఫిరాయింపుల కోసం బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుందని కూడా ఆయన విమర్శలు చేశారు. 8 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు 8 వేల కోట్లను వినియోగించిందని రేవంత్ రెడ్డి ఆరపించారు.