కేసీఆర్ పాదయాత్ర చేస్తే నేను నిలిపివేస్తా: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్

By narsimha lodeFirst Published Aug 29, 2022, 7:51 PM IST
Highlights


తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే తాను పాదయాత్రను నిలిపివేస్తానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఇతర పార్టీలను రాష్ట్రంలో తిరగనివ్వవద్దని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.


హైదరాబాద్:సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే తాను పాదయాత్రను నిలిపివేస్తామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. సోమవారం నాడు రాత్రి  హైద్రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తాను పాదయాత్ర చేస్తున్నందునే  కేసీఆర్ అక్కసుతో వ్యవహరిస్తున్నారన్నారు. తనకు నచ్చిన ప్రాంతంలోనే పాదయాత్ర చేయాలని కేసీఆర్ కు బండి సంజయ్ సూచించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీస్ బందోబస్తు లేకుండా  కేసీఆర్  పాదయాత్ర చేస్తే తాను పాదయాత్రను నిలిపివేస్తానని బండి సంజయ్ చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర వల్లే కేసీఆర్ కు పిచ్చి ముదురుతుందన్నారు. తాను సెప్టెంబర్ 12న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా చెప్పారు.

  అదే రోజున పాదయాత్ర చేస్తావా అని కేసీఆర్ ను బండి సంజయ్ అడిగారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా ఇతరుల్ని తిడతారా అని  సంజయ్ ప్రశ్నించారు. 

లిక్కర్ స్కాంలో తన కుటుంబ సభ్యుల ప్రమేయం  లేదని కేసీఆర్ ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని సంజయ్ ప్రశ్నించారు.  చీకోటి చీకటి దందాలో ఎవరి భాగస్వామ్యం ఉందని ఆయన అడిగారు.  డ్రగ్స్ , మైనింగ్ మాఫియా, మానవ అక్రమ రవాణాలో ఎవరి ప్రమేయం ఉందో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు.

క్రైమ్ రేట్ లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని ఆయన విమర్శించారు.  ఇతర పార్టీలను రాష్ట్రంలో తిరగకుండా చూడాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ తరహా వ్యాఖ్యలు సరైనవి కావన్నారు.పెద్దపల్లి జిల్లాకు ఏం చేశారని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు.ప్రధాని మోడీకి మీటర్లు పెడతామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మండి పడ్డారు.ఎక్కడెక్కడ ఏం చేశావో ఈడీ  మీటర్లు పెడుతుందని కేసీఆర్ పై  సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
 

click me!