
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో (icrisat 50 years) ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇక్రిశాట్ ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇక్రిశాట్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా కొత్త వంగడాలను ఎలా ఉత్పత్తి చేస్తారో శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. సజ్జ, కంది, శెనగ, వేరుశెనగ ఇతర చిరుధాన్యాలు, విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని తెలుసుకున్నారు. అలాగే వర్షపు నీటి నిర్వహణపై వీడియోను మోడీ తిలకించారు. అనంతరం ప్రధాని మోడీకి ఇక్రిశాట్ డైరెక్టర్ జాక్వెలిన్ హ్యూస్ జ్ఞాపికను అందజేశారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నరేంద్ర సింగ్ తోమర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై వున్నారు.
అనంతరం వేదికపై తోమర్ (narendra singh tomar) మాట్లాడుతూ.. ఈ దేశానికి రైతులు, వ్యవసాయం చాలా ప్రధానమైనవని అన్నారు. ఒకప్పుడు జై జవాన్.. జై కిసాన్ అనే వారని, అయితే వాజ్‌పేజ్ ప్రధాని అయ్యాక జై విజ్ఞాన్‌ను జోడించారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి గుర్తుచేశారు. మోడీ ప్రధాని అయ్యాక జై అనుసంధాన్ కూడా దానికి జోడించారని నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రధాని చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. కోవిడ్ సమయంలో తృణధాన్యాల వినియోగం పెరిగిందని తోమర్ చెప్పారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను పూర్తి చేసుకోవడం స్పూర్తిదాయకమన్నారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మోడీ ప్రధాని అయ్యాక ప్రతిఏడు బడ్జెట్‌లో దేశానికి కొత్త దిశ సూచిస్తున్నారని తోమర్ తెలిపారు. వచ్చే 25 ఏళ్లకు మార్గదర్శనం చేసేలా ఈసారి బడ్జెట్ రూపొందించారని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇది
ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రత్యేక విమానంలో Shamshabad international airportకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు వెళతారు. అక్కడ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక.. యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. తర్వాత దివ్యక్షేత్రాలను, రామానుజుల బంగారు విగ్రహం ప్రతిష్టాపన స్థలాన్ని పరిశీలిస్తారు.
సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల భారీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేస్తారు. అనంతరం రుత్విక్కుల నుంచి వేదాశీర్వచనం, చినజీయర్ స్వామి నుంచి మహా ప్రసాదాన్ని అందుకుంటారు. అనంతరం 8.20 గంటలకు ముచ్చింతల్ ఆశ్రమం నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్కడి నుంచి 8.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.