మునుగోడు ఉప ఎన్నికలను పురస్కరించుకొని నిర్వహించిన తనిఖీల్లో లెక్కలు చూపని రూ.6.80 కోట్ల నగదును సీజ్ చేసినట్టుగా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.
హైదరాబాద్:మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు చెప్పారు. సోమవారంనాడు ఆయన హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటివరకు 185 కేసులు నమోదు చేశామన్నారు.సరైన పత్రాలు లేని రూ.6.80 కోట్ల నగదును సీజ్ చేసినట్టుగా ఆయన వివరించారు.నవంబర్ 3న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టుగా చెప్పారు.
పోలింగ్ కేంద్రానికి పోలింగ్ ఏజంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే రావాలని ఆయన కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు ఆఫీసర్లుంటారని ఆయన వివరించారు. మునుగోడు ఎన్నికల కోసం 1192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. వీరితో పాటు అదనంగా 300 మందిని రిజర్వ్ లో పెట్టినట్టుగా వికాస్ రాజు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 199 మైక్రో అబ్జర్వర్లను నియమించినట్టుగా ఆయన తెలిపారు.ప్రతి గంటకు పోలింగ్ పర్సంజెజీని అప్ డేట్ చేసేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుండి నేరుగా ఓటింగ్ పర్సంటేజీని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
అన్ని పోలింగ్ స్టేషన్లలో లైటింగ్ ,మెడికల్ స్టాఫ్ ,టాయిలెట్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బందికి తామే భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.3366 మంది పోలీస్ సిబ్బందిని మునుగోడు ఉప ఎన్నికల కోసం వినియోగిస్తున్నామన్నారు.15 కంపెనీల సెంట్రల్ పోలీస్ బలగాల సేవలను కూడా ఉపయోగిస్తామన్నారు.వృద్దులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో వెక్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు.రెండు జీఎస్టీ బృందాలను కూడా నియమించినట్టుగా ఆయన వివరించారు.