ఈసీ ఇచ్చిన నోటీసులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిసమాధానం ఇచ్చారు. సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుండి మునుగోడులో పలువురికి డబ్బులు ఇచ్చారని టీఆర్ఎస్ ఫిర్యాదుపై రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు
హైదరాబాద్:ఈసీ ఇచ్చిన నోటీసులకు మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమాధానం పంపారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుండి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి భారీగా నగదును పంపారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ విసయమై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొందరికి సుశీ ఇన్ ఫ్రామ సంస్థ నుండి విడతల వారీగా రూ.5.2 కోట్లను పంపారని టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నెల 14,18,29 తేదీల్లో ఈ నగదును బదిలీ చేశారని టీఆర్ఎస్ రాత పూర్వకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది. సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుండి ఎవరెవరి ఖాతాలకు ఎంత నగదును బదిలీ చేశారనే విషయమై కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.
ఈ విషయమై వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈసీ ఇచ్చిన నోటీసులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమాధానం పంపారు. సుశీ ఇన్ ఫ్రా కంపెనీ వ్యవహరాలను తన కొడుకు చూస్తున్నాడని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుండి మునుగోడులో ఎవరికీ నగదును పంపలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.టీఆర్ఎస్ తప్పుడు పిర్యాదు చేసిందన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈసీకి ఇచ్చిన సమాధానంలో అన్ని విషయాలను ప్రస్తావించినట్టుగా రాజగోపాల్ రెడ్డి వివరించారు.మునుగోడులో ఓటమి పాలౌతామనే భయంతో టీఆర్ఎస్ తనపై ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు.
undefined
ఈ ఏడాది ఆగస్టు 4న కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.ఆ తర్వాత నాలుగు రోజులకు మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు. వచ్చే నెల3న మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్ధిగా ఇదే స్థానం నుండి బరిలోకి దిగారు.
also read:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు.. 5.2 కోట్ల నిధుల బదిలీపై వివరణ ఇవ్వాలని ఆదేశం..
మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిలు బరిలోకి దిగారు. ఈ స్థానంలో మొత్తం 47 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికను పురస్కరించుకొని గుర్తుల కేటాయింపు అంశంలో నిబంధనలు పాటించలేదని రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై ఈసీ వేటేసింది.అదేవిధంగా భద్రతా చర్యలను సరిగా పర్యవేక్షణ లేదని డీఎస్పీపై చర్యలు తీసుకుంది ఈసీ.