
తెలంగాణ అడ్వొకెట్ జనరల్ (ఎజి) రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఆయన ఏజి పదవిలో ఉన్నారు. తొలి తెలంగాణ ఎజిగా ఆయన రికార్డులోకెక్కారు. ఆయన తన పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మూడేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం పలు సందర్భాల్లో కోర్టుల్లో ఇబ్బందులకు గురైన సందర్భాలున్నాయి. ఎజి పనితీరు పట్ల గత కొంతకాలంగా సిఎం కెసిఆర్ అసంతృప్తితో ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. మొత్తానికి మూడేళ్ల పదవీకాలం ముగియడంతో ఆయన బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు కొంత మంది ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వ సహాయ న్యాయవాదుల అవినీతి అక్రమాలపై ఎజి తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని, సుమారు 30 మంది వరకు ప్రభుత్వ న్యాయవాదులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని ఆయన సర్కారు దృష్టికి తీసుకుపోయారని చెబుతున్నారు. కానీ వారిపై చర్యలు తీసుకోవాలని పదే పదే కోరినా సర్కారు స్పందించలేదని, అందుకే ఆయన తన అసంతృప్తిని పలువురు సన్నిహితులైన న్యాయవాదుల వద్ద వెల్లడించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక హైకోర్టు న్యాయవాది ఏసియా నెట్ కు చెప్పారు.
నిబద్ధత కలిగిన, నిఖార్సైన న్యాయవాదిగా రామకృష్ణారెడ్డి పేరు తెచ్చుకున్నారని, కానీ ఆయన సూచనలను సర్కారు పెడచెవిన పెట్టడం బాధాకరమని ఆయన చెప్పుకొచ్చారు. తదుపరి ఎజిగా దేశాయి ప్రకాశ్ రెడ్డి నియమాకం కానున్నట్లు తెలిసింది.