
నిజామాబాద్ : నిజామాబాదులో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో శుక్రవారం భవన కూల్చివేత పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు మృతిచెందారు. బిల్డింగ్ నుండి ప్రమాదవశాత్తు జారిపడి ఓ కూలి మృతి చెందాడు. అది చూసి గుండెపోటుతో మరో కూలి చనిపోయాడు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవి… మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు జన్నేపల్లిలో ఒక అతిథి గృహం ఉంది. దీనికి నెల రోజులుగా మరమ్మత్తులు జరుగుతున్నాయి. నిజామాబాదుకు చెందిన ఓ గుత్తేదారు ఈ పనులను నెల రోజులుగా చేస్తున్నాడు.
ఈ పనుల్లో నిజామాబాద్ వినాయక్ నగర్ కు చెందిన కొండపల్లి రాజు (28) చేరాడు. రాజు తల్లిదండ్రులతో కలిసి ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కూల్చివేత పనుల కోసం మరో ఐదుగురు కూలీలతో పాటు రాజు కూడా వచ్చాడు. గోడ కూలుస్తున్నారు. ఇంతలో కాలుజారి రాజు అక్కడి నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక నిమిషం ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. అంతలోనే తేరుకొని గమనించేసరికి రాజు మృతి చెంది కనిపించాడు. అదే బిల్డింగ్ లో మరో కూలి పని చేస్తున్నాడు. అతని పేరు సాయిలు(29).
రాజు కింద పడి మరణించడం చూసిన సాయిలు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. దీంతో గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే చనిపోయాడు. తోటి కూలీలు చాతిపై తడుతూ సిపిఆర్ చేసే ప్రయత్నం చేసినా.. అతడిని కాపాడలేకపోయారు. ఈ ఘటన మీద ఎస్సై రాజారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలియాలి.