Telangana : అమ్మా మహాలక్ష్ములు ... మీరిక మారరా.. బస్సుల్లో ఏంటిది తల్లీ...

By Arun Kumar PFirst Published Apr 25, 2024, 10:42 AM IST
Highlights

యావత్ తెలంగాణ మహిళాలోకం పరువు తీసేలా ప్రవర్తించారు ఇద్దరు మహిళలు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం మహిళకోసం తీసుకున్ని మంచి నిర్ణయాన్ని వేలెత్తిచూపేలా చేసారు. ఇంతకూ ఈ మహిళలు ఏం చేసారో చూడండి...

హైదరాబాద్ : రెండు కత్తులను ఒకే ఒరలో ఇమడ్చవచ్చేమో గానీ రెండు కొప్పులు మాత్రం ఒకేచోట ఇమడవు. తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తోంది. కేవలం సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడమే కాదు తమ మొగుళ్లను గొడవకు ఉసిగొల్పారు. మహిళలు, వారి భర్తలు బస్సులోనే పొట్టుపొట్టు కొట్టుకుంటుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఆడవాళ్లకు శతృవులు ఎక్కడో వుండరు... తోటి ఆడవాళ్ల రూపంలో పక్కనే వుంటారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటనలెన్నో ఇటీవలకాలంలో తెలంగాణలో వెలుగుచూస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీ మేరకు మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రయాణం కావడంతో మహిళలతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది... కానీ కొందరు మహిళలు బస్సుల్లో హుందాగా వుండకుండా రచ్చరచ్చ చేస్తూ ఈ పథకానికే చెడ్డపేరు తెస్తున్నారు. ఇలాంటి మహిళల కోసమా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది? అనేలా ప్రవర్తిస్తున్నారు.  

తాజాగా మహబూబాబాద్ నుండి హైదరాబాద్ కు వెళుతున్న ఆర్టిసి బస్సులో ఇద్దరు మహిళలు, వారి భర్తలు రచ్చరచ్చ చేసారు. తొర్రూరు వద్ద రెండు జంటలు ఆర్టిసి బస్సు ఎక్కాయి. అయితే వీరిలో ఓ జంట బయటినుండే ఖాళీగా వున్న సీటుపై కర్చీప్ వేయగా... మరో జంట ముందుగానే బస్సెక్కి ఆ సీటులో కూర్చున్నారు. మేము ముందుగ ఖర్చీప్ వేసాను కాబట్టి ఆ సీటు మాదేనని ఓ జంట... ముందుగా బస్సెక్కి కూర్చున్నాము కాబట్టి ఆ సీటు మాదేనని మరోజంట గొడవకు దిగారు. ఇలా సీటు కోసం రెండు జంటల మధ్య ప్రారంభమైన గొడవ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి పెరిగింది. 

మొదట ఇద్దరు మహిళలు నోటికొచ్చిన బూతులు తిట్టుకోగా... ఆ తర్వాత వారి భర్తలు ఏకంగా దాడులు చేసుకున్నారు. చివరకు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. వీళ్ల సీటు గొడవ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది పెట్టింది. దీంతో ప్రయాణికుల్లో ఎవరో ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది. 

సీటు కోసం ఆర్టీసీ బస్సులో ఘోరంగా చెప్పులతో కొట్టుకున్నారు

మహబూబాబాద్ - తొర్రూరు నుంచి ఉప్పల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చోవడంతో.. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ, అది కాస్తా వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. pic.twitter.com/ewGMl2ePQV

— Telugu Scribe (@TeluguScribe)

ఇప్పటికే మహిళలకు ఉచితప్రయాణ పథకాన్ని విమర్శిస్తున్నవారికి ఈ వీడియో మరింత చాయిస్ ఇచ్చింది. ఇందుకోసమేనా మహిళలకు బస్సుల్లో ఉచితప్రయాణం అని కొందరు... ఎంతో స్నేహంగా వుండే మహిళల మధ్య ఈ పథకం చిచ్చు పెడుతోందని మరికొందరు... మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పథకాలు అవసరమా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూడటంతో 'మహాలక్ష్ములు.. ఇక మీరు మారరా' అని పురుషులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. 

click me!