తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు: 18కి చేరిన సంఖ్య

By telugu teamFirst Published Mar 20, 2020, 3:21 PM IST
Highlights

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరుకుంది. ఇండోనేషియా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని ఈటెల రాజేందర్ అన్నారు. ఇటలీలోని పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 18 మందికి ఏ విధమైన ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే ఆ లక్షణాలున్నాయని ఆయన చెప్పారు.

Also Read: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్: పదో తరగతి పరీక్షలు వాయిదా

ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రేపు (శనివారం) కరీంనగర్ వెళ్లనున్నారు. కరీంనగర్ కు విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా వైరస్ ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఆందోళన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 

ఇండోనేషియా నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వారు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కరీంనగర్ లో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ రేపు శనివారం పరిశీలించనున్నారు. 

Also Read: కరోనా వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నవారి కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కజికిస్తాన్, దుబాయ్, ఇండోనేషియాల నుంచి వచ్చినవారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

తెలంగాణలో 104 కాల్ సెంటర్ కు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం కరోనా కట్టడికి 116.28 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ల్యాబ్స్, ప్రత్యేక పరికరాల కోసం 33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. క్వారంటైన్, స్క్రీనింగ్ కోసం 83.25 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

click me!