అనాజ్ పూర్ లో రెండు నెలల బాలుడి హత్య: మేనమామ భార్యనే హంతకురాలు

By telugu teamFirst Published Jun 20, 2021, 7:03 AM IST
Highlights

రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ లో జరిగిన రెండు నెలల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడి మేనమామ భార్యనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ లో శుక్రవారం జరిగిన రెండు నెలల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడి మేనమామ భార్యనే ఈ హత్య చేసినట్లు తేలింది. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ సీఐ వాసం స్వామి, ఎస్సై వీరభద్రంలతో కలిసి శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

అనాజ్ పూర్ కు చెందిన లత అలియాస్ బాలమణికి ఇబ్రహీంపట్నం మండలం నెర్రెపల్లికి చెందిన దూసరి తిరుమలేష్ దంపతులకు వివాహమైన 12 ఏళ్లకు కుమారుడు జన్మనించాడు. కుమారుడు పుట్టినప్పటి నుంచి లత అనాజ్ పూర్ లోని పుట్టింట్లోనే ఉంటోంది. 

ఆమె తమ్ముడు బాలరాజు భార్య శ్వేతకు రెండు నెలల క్రితం మూడు నెలల గర్భం ఉన్న సమయంలో అనారోగ్యం కారణంగా గర్భస్రావమైంది. ఆ సమయంలో ఆడబిడ్డ లత చూసి నవ్విందని, థైరాయిడ్ ఉన్నవాళ్లకు త్వరంగా గర్భం రాదని అవమానించిందని శ్వేత భావించి ఆమెపై కక్ష పెంచుకుంది. 

పిల్లలు లేకపోతే కలిగే బాధను అడబిడ్డకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆమె బిడ్డను చంపాలని నిర్ణయించుకుంది. సమయం కోసం వారం రోజుల పాటు నిరీక్షించింది. శుక్రవారం తెల్లవారు జామున బాలుడినిని తల్లి పక్కలో నుంచి తీసుకుని ఇంటికి పైకి తీసుకుని వెళ్లింది. బాలుడి ముక్కు, ఛాతీపై అదిమి హత్య చేసేందుకు ప్రయత్నించింది. అయితే, బాలుడు నిద్రలేచి ఏడ్వడం ప్రారంభించాడు. 

దాంతో బాలుడిని శ్వేత పక్కనే ఉన్న నీళ్ల ట్యాంకులో వేసి ఐదు నిమిషాల పాటు అక్కడే ఉండి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్లి ఏమీ తెలియనట్లుగా పడుకుంది. నిద్రలేచిన తర్వాత తన కుమారుడు కనిపించడం లేదని లత ఆందోళన చెందింది. కుటుంబ సభ్యులతో పాటు తనకు కూడా ఏమీ తెలియనట్లు శ్వేత నటించింది. 

బయటివారు ఇంట్లోకి వచ్చి బాలుడిని హత్య చేసే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లత ప్రవర్తనపై వారికి అనుమానం వచ్చింది. దీంతో శ్వేతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో శ్వేత నేరాన్ని అంగీకరించింది. శ్వేతను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

click me!