
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు వర్గాల కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు మృతిచెందారు. దాదాపు 30 మందికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే తొలుత గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను కొందరు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసు బలగాలు గ్రామంలోకి చేరుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read: వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్న యాంకర్ శ్యామల.. సంతోషంగా ఉందంటూ కామెంట్స్..
ఘర్షణల్లో మరణించిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులు గ్రామంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ గొడవలు చోటుచేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.