మెదక్‌లో కారు బీభత్సం.. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి..

By Sumanth KanukulaFirst Published Dec 24, 2022, 10:13 AM IST
Highlights

మెదక్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 

మెదక్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఈ రోజు తెల్లవారుజామున పారిశుద్ద్య కార్మికులు విధులు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అయితే వారిని రాందాస్‌ చౌరస్తా నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికిక్కడే మృతిచెందింది. మరో నలుగురు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికత్స పొందుతూ యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు మహిళలకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మెదక్ డీఎస్పీ సైదులుతో పాటు పలువురు పోలీసు అధికారులు.. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. మున్సిపల్ సిబ్బంది, కార్మికులు ఘటన స్థలానికి  చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా డీఎస్పీ తెలిపారు. మృతిచెందిన మహిళల మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మెదక్ ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయినట్టుగా  తెలుస్తోంది. 

click me!