భద్రాద్రి జిల్లాలో విషాదం... బావిలో దిగి అన్నదమ్ముల మృతి, మరొకరి పరిస్థితి విషమం

Published : Mar 23, 2023, 01:54 PM ISTUpdated : Mar 23, 2023, 01:59 PM IST
భద్రాద్రి జిల్లాలో విషాదం... బావిలో దిగి అన్నదమ్ముల మృతి, మరొకరి పరిస్థితి విషమం

సారాంశం

ఉపాధి కోసం తెలంగాణకు వలసవచ్చిన చత్తీస్ ఘడ్ కు చెందిన అన్నదమ్ములు ఉగాది పండగపూటే దుర్మరణం చెెందారు. 

భద్రాచలం : ఉపాధి కోసం వలసవచ్చిన ఇద్దరు అన్నదమ్ములు ఉగాది పండగపూటే దుర్మరణం చెందారు. భద్రాద్రి జిల్లాలోని ఓ అట్టల ఫ్యాక్టరీలో బావిని శుభ్రం చేయడానికి దిగిన  అన్నదమ్ములు విషవాయువులు పీల్చి మృతిచెందగా వారిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు హాస్పిటల్ పాలయ్యారు. ఈ దుర్ఘటనతో చత్తీస్ ఘడ్ కు చెందిన వలస కూలీల శిబిరంలో తీవ్ర విషాదం నెలకొంది. 

వివరాల్లోకి వెళితే... చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాకు చెందిన పదిమంది కార్మికులు ఉపాధి నిమిత్తం తెలంగాణకు వచ్చారు. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం సమీపంలోని ఎస్ఎస్ అట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే ఉగాది పండగపూట ఈ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువుల ప్రభావంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పండగపూటే మృతిచెందారు. 

నిన్న(బుధవారం) కావాసి జోగా(21), కావాసి బుద్దరామ్(23) సోదరులు ఫ్యాక్టరీలోని పేపర్ గుజ్జును నిల్వవుంచే చిన్న బావిని శుభ్రం చేయడానికి ప్రయత్నించారు. నిచ్చెన వేసుకుని పది అడుగుల లోతున్న ఈ బావిలోకి దిగారు. అయితే ఆ బావిలో విషవాయువులు నిండిపోవడంతో వాటిని పీల్చిన అన్నదమ్ములిద్దరూ స్ఫృహతప్పి పడిపోయారు. ఇది గమనించిన మరో ఐదుగురు కార్మికులు వారిని కాపాడేందుకు బావిలోకి దిగారు. దీంతో ఇంకో ఇద్దరు కూడా విషయవాయులు పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 

Read More  విశాఖపట్నంలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

ప్రాణాపాయ స్థితిలో వున్న కార్మికులను బూర్గంపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హాస్పిటల్ కు చేరేలోపే జోగా మృతిచెందగా పరిస్థితి విషమంగా వుండటంతో బుద్దరామ్ ను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలిస్తుండగా మృతిచెందాడు. వీరిని కాపాడే ప్రయత్నంలో తీవ్ర అస్వస్థతకు గురయిన లక్ష్మీపురం గ్రామస్తుడు గొగ్గలి రాంబాబును భద్రాచలం తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. 

ఉగాది పండగపూట అన్నదమ్ముల మృతి ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?