అసలు జరిగిందిదీ, అందుకే రవిప్రకాశ్‌ను తప్పించాం: టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్

By Siva KodatiFirst Published May 10, 2019, 6:49 PM IST
Highlights

టీవీ9లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు అలందా మీడియా సంస్ధ మేనేజ్‌మెంట్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది

అలంద మీడియా తొమ్మిది నెలల క్రితం 90.5 శాతం షేర్లను ఏబీసీఎల్ నుంచి కొనడం జరిగిందని తెలిపారు అలాందా మీడియా కంపెనీ ప్రతినిధులు. టీవీ9లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు అలందా మీడియా సంస్ధ మేనేజ్‌మెంట్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది.

సాంబశివరావు, జగపతిరావ్, శ్రీనివాస్, కౌశీక్‌ను డైరెక్టర్లుగా నియమితులయినట్లు సాంబశివరావు తెలిపారు. అయితే ఏబీసీఎల్ మేనేజ్‌మెంట్ తమ నియామకానికి సంబంధించిన అనుమతులను ఆలస్యం చేశారని ఆయన తెలిపారు.

తమ నియామక పత్రాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఆలస్యంగా పంపారని సాంబశివరావు వెల్లడించారు. మార్చిలో ఇందుకు సంబంధించిన అనుమతి లభించిందన్నారు. అయితే ఈ మధ్యలో తాము డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహించేందుకు రవిప్రకాశ్, మూర్తి అడ్డంకులు సృష్టించారని సాంబశివరావు తెలిపారు.

దీంతో మే 8న బోర్డు సమావేశం నిర్వహించి సీఈవోగా ఉన్న రవిప్రకాశ్‌ను, సీఎఫ్‌వోగా ఉన్న మూర్తిని తొలగించామని తెలిపారు. సంస్థ ఉద్యోగులు సైతం తమతో సహకరిస్తామని చెప్పినట్లుగా ఆయన గుర్తు చేశారు.

ఛానెల్ వ్యవహారాలు సజావుగా సాగేందుకు వీలుగా టీవీ9 కన్నడ ఎడిటర్ మహేంద్ర మిశ్రాను తాత్కాలిక సీఈవోగా, సీవోవోగా సింగారావు నియమించినట్లు సాంబశివరావు వెల్లడించారు. రవిప్రకాశ్ చేసే ఎటువంటి చర్యలకు టీవీ9కు సంబంధం లేదన్నారు. అయితే షేర్ హోల్డర్‌గా షేర్ హోల్డర్ల సమావేశానికి హాజరుకావొచ్చని తెలిపారు. 

click me!