నిధుల గోల్ మాల్ కేసు: రిమాండ్ కు టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్

By Nagaraju penumalaFirst Published Oct 5, 2019, 7:54 PM IST
Highlights

ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.18 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారన్న అంశంపై ఆరా తీశారు. రవిప్రకాశ్‌​​ మూడు విడతల్లో డైరెక్టర్లకు చెప్పకుండా రూ.6కోట్ల 36 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

హైదరాబాద్‌ : ఏబీసీఎల్ కంపెనీ నుంచి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ బృందం రూ.18 కోట్లు గోల్ మాల్ చేసినట్లు బంజారా హిల్స్ పోలీసులు నిర్ధారించారు. ఏబీసీఎల్ కంపెనీలో నిధుల దుర్వినియోగంపై అలందా మీడియా రవిప్రకాశ్, మాజీ సీఎఫ్ వో ఎంకేవీఎస్ మూర్తిపై టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు బంజారాహిల్స్ పీఎస్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా శనివారం ఉదయం రవిప్రకాశ్ ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారించారు.  

ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.18 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారన్న అంశంపై ఆరా తీశారు. రవిప్రకాశ్‌​​ మూడు విడతల్లో డైరెక్టర్లకు చెప్పకుండా రూ.6కోట్ల 36 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు డీసీపీ సుమతి స్పష్టం చేశారు.  

ఇకపోతే మాజీ సీఎఫ్ వో ఎంకేవీఎన్‌ మూర్తి రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేసినట్లు విచారణలో తేలింది. అలందా షేర్‌ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్‌ బృందం భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్‌ డ్రా చేసినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. 

విచారణ అనంతరం టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్, మాజీ సీఎఫ్ వో ఎంకేవీఎన్ మూర్తిలను గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్ మారేడ్ పల్లిలోని జడ్జీ నివాసంలో హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా  తమకు తాము భారీగా బోనస్‌లు కూడా ప్రకటించుకున్నట్లు కూడా విచారణలో స్పష్టమైనట్లు తెలిపారు. బోర్డు యెుక్క ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కంపెనీ నిధులను తమ సొంత నిధులకు మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని డీసీపీ సుమతి తెలిపారు. 

రవిప్రకాశ్, మాజీ సీఎఫ్ వో ఎంకేవీఎన్ మూర్తిలను తమ కస్టడీ కోరనున్నట్లు తెలిపారు. తాము కేసునమోదు చేసిన సెక్షన్ 409 అనేది నాన్ బెయిల్ బుల్ కేసు అని చెప్పుకొచ్చారు. అలాగే 418, 420 కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

 బీసీఎల్‌ కంపెనీని టేకోవర్‌ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న సమావేశమైంది. ఆ సమావేశంలో నిధుల గల్లంతును గమనించి రవిప్రకాశ్‌ అతని బృందంపై పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

"

ఈ వార్తలు కూడా చదవండి

టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్ అరెస్టు

రవిప్రకాష్ కు చిక్కులు: రేవంత్ రెడ్డితో నయా దోస్తీ, హుజూర్ నగర్ లో వేలు

click me!