
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు సిద్దమైంది. ఇప్పటికే పలు ఆర్టీసీ సర్వీసులకు ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 900 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను అధునాతన ట్రాకింగ్ పరికరాలతో అమర్చనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు టీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆర్టీసీ ట్రాకింగ్ యాప్‌ని ఉపయోగించి.. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే అనేక అత్యవసర ఫీచర్‌లను యాక్సెస్ చేయగలరు. ట్రాకింగ్ టెక్నాలజీ దాని నంబర్ ప్లేట్ లేదా రూట్ నంబర్ ద్వారా బస్సు షెడ్యూల్‌ను పర్యవేక్షించడానికి ఉపయోగపడనుంది. తద్వారా బస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మకంగా జరుగుతున్నప్పటికీ.. క్రమంగా మిగిలిన ఆర్టీసీ సర్వీసులకు విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
‘‘ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిమితుల్లో పుష్పక్, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి సేవల కోసం యాప్ లైవ్ సేవలను అందిస్తుంది. జిల్లాలకు డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ మరియు లహరి సేవలకు ట్రాకింగ్ అందుబాటులో ఉంది. వచ్చే మూడు నెలల్లో సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులకు కూడా పొడిగించబడుతుంది’’ అని టీఎస్ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
ఇక, టీఎస్ఆర్టీసీ ఈ యాప్ 2022లో ప్రవేశపెట్టబడింది. అయితే తొలుత ఎయిర్‌పోర్టు, నగరంలోని ఇతర ప్రాంతాల మధ్య నడిచే 39 ఏసీ ఈ-బస్సులకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే గత వారం నుంచి వివిధ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆర్టీసీకి నావిగేషన్ టెక్ కంపెనీ మ్యాప్ మైఇండియా సహకరిస్తున్నట్లు సమాచారం.
కొత్త సాంకేతికతతో నడిచే ఫీచర్.. ప్రజా రవాణాను అనేక మంది కొత్త వినియోగదారులకు ఆకర్షణీయంగా మార్చేందుకు నిర్దేశించినప్పటికీ.. కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు.. అప్లికేషన్ ఇంటర్‌ఫేస్‌లో రాబోయే బస్సుల రూట్ నంబర్‌లు కూడా లేవు. కేవలం బస్సు నంబర్ ప్లేట్‌లను మాత్రమే ఉపయోగించడం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. అయితే వీటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.