మేడారం జాతరకు ఆర్టీసీలో వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా మేడారం బస్సుల్లో వెళ్లవచ్చని వివరించారు. అయితే.. ఈ బస్సుల్లోకి కోళ్లు, గొర్రెలు వంటి మూగ జీవాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Sajjanar: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం కీలక ప్రకటన చేశారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీలో వెళ్లే భక్తులకు ఆయన ఓ సూచన చేశారు. బస్సుల్లోకి మూగ జీవాలను తీసుకురావద్దని కోరారు. బస్సులోకి కోళ్లు, గొర్రెలు, మేకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వాటిని బస్సులోకి తీసుకురావొద్దని, ఇందుకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.
మేడారం జాతర కోసం రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా బస్సులను నడుపుతున్నామని సజ్జనార్ తెలిపారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం మేడారం జాతరకు నడిచే స్పెషల్ బస్సులకు కూడా వర్తిస్తుందని సజ్జనార్ తెలిపారు. మహిళలు మేడారానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లవచ్చని పేర్కొన్నారు.
Also Read: ఈసారి హైదరాబాద్ ఎంఐఎం సీటు కూడా మేమే గెలుస్తాం: కిషన్ రెడ్డి
మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే తీవ్ర రద్దీ నెలకొంది. మేడారం జాతరలో 15 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని సజ్జనార్ వివరించారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని 15 కిలోమీటర్ల మేరకు 48 క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.