జోక్యం చేసుకోండి, ప్రభుత్వంతో మాట్లాడండి: గవర్నర్ కు ఆర్టీసీ జేఏసీ నేతల ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Oct 14, 2019, 3:30 PM IST
Highlights

ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కార్మికులను రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితి దారి తీసిందన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. 
 

హైదరాబాద్:  ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు సమ్మె చేస్తున్నామని అందులో ఎలాంటి స్వార్థం లేదని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు స్పష్టం చేశారు టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు. 

ఆర్టీసీ సమ్మె, తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్  సౌందర రాజన్ కు ఫిర్యాదు చేశారు ఆర్టీసీ జేఏసీ నేతలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతున్న వైనం, అందుకు దారి తీసిన కారణాలను సీడీల రూపంలో అందజేసినట్లు జాక్ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చేస్తున్న ప్రకటనలపై కూడా ఆధారాలతో సహా గవర్నర్ సౌందర రాజన్ కు అందించినట్లు తెలిపారు. సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు చేస్తున్న ప్రకటనల వల్ల ఉద్యోగులు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 

సమ్మెకు సంబంధించి కొన్ని అంశాలపై గవర్నర్ సౌందరరాజన్ ఆరా తీసినట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె అనేది ప్రజారవాణా వ్యవస్థను కాపాడేందుకే చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సమ్మె వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. 

 ఆర్టీసీని విలీనం చేస్తామని నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు అశ్వత్థామరెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచకపోయినా హామీ అయితే ఇచ్చారని అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు తెలిపారు.  

ఇకనైనా సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం చొరవచూపాలని కోరారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కార్మికులను రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితి దారి తీసిందన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. 

గవర్నర్ సౌందరరాజన్ ఆర్టీసీ సమ్మెపై అధ్యయనం చేస్తున్నారని తెలుస్తోందన్నారు. సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం ఇంకా బెదిరింపులకు పాల్పడుతుందని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులను రెచ్చగొట్టేలా ప్రభుత్వ పెద్దలు తమ ప్రకటనలు మానుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. 

click me!