#RTC Strike భయపెట్టొద్దు.. చర్చలే అన్నింటికీ పరిష్కారం: అశ్వత్థామరెడ్డి

By sivanagaprasad KodatiFirst Published Nov 6, 2019, 12:41 PM IST
Highlights

చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే, ఇబ్బందికరమైన సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుందామని.. కార్మికులను భయపెట్టించే చర్యలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. డిమాండ్లు తగ్గించుకోవాల్సి వస్తే అందుకు సిద్ధమని అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు.

చట్ట ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ ఇంకా విభజించబడలేదన్నారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. బుధవారం జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిశారు.

అనంతనం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం కొత్తగా రూపొందించిన మోటారు వాహన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారని అశ్వత్ధామరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు దానిని అమలు చేయాలంటే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాల్సి ఉంటుందన్నారు.

ఇదంతా క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కార్మికులు మనో నిబ్బరంతో ముందుకు సాగాలని.. కొందరు భయపడి విధుల్లో చేరారని అశ్వత్థామరెడ్డి తెలిపారు.

అధికారుల ఒత్తిడితోనే వారు విధుల్లో చేరారని.. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 20 మంది కూడా జాయిన్ అవ్వలేదని ఆయన వెల్లడించారు. కార్మికులంతా ఇదే ధైర్యంతో కొనసాగాలని.. మహిళా కార్మికులని కూడా లేకుండా టెంట్లలోకి వెళ్లి వారిని బలవంతంగా జైలుకు తీసుకెళ్లారని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు.

Also Read:RTC Strike: కేసీఆర్ హెచ్చరికలు బేఖాతరు, మెట్టు దిగని కార్మికులు

ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల పట్ల మానవతా దృక్ఫథంతో ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే, ఇబ్బందికరమైన సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుందామని.. కార్మికులను భయపెట్టించే చర్యలను మానుకోవాలని ఆయన హితవు పలికారు.

డిమాండ్లు తగ్గించుకోవాల్సి వస్తే అందుకు సిద్ధమని అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. మరో నేత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్వయంగా సామదాన భేద దండోపాయాలతో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రచేసినా కార్మికులు వెనక్కి తగ్గలేదన్నారు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కలిగించినా, చివరికి ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపులకు పాల్పడినా కార్మికులు మొక్కవోని ధైర్యంతో సమ్మె చేస్తున్నారని ఆయన కొనియాడారు. తమవి న్యాయమైన డిమాండ్లు కాబట్టే ఆర్టీసీ కార్మికులు సైతం వెనక్కి తగ్గడం లేదని ఆయన తెలిపారు.

Also Read:డెడ్‌లైన్ దాటితే ఉద్యోగాల్లోకి తీసుకోం.. ఆర్టీసీ ఇక లేనట్లే: తేల్చిచెప్పిన కేసీఆర్

సీఎం కేసీఆర్ సమ్మె విచ్ఛిన్నానికి కాకుండా సమ్మె నివారణకు చర్యలు తీసుకుంటే మంచిదని ఆయన సూచించారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ కార్మికులు సమ్మెలో పాల్గొంటూనే ఉన్నారు.

బుధవారం ఉదయం నాటికి 487 మంది కార్మికులు విధుల్లో చేరినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ నేపథ్యంలో న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అంశాలపై సీఎం చర్చించనున్నారు. 

click me!