
గ్రూప్-1 పరీక్షపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్ పద్దతిలో(ఓఎంఆర్)నిర్వహించనున్నట్టు పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ (ఆన్లైన్)లో నిర్వహిస్తారనే ఉహాగానాలు వెలువడ్డాయి. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో 25 వేలలోపు మంది అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష రాసేందుకు అవకాశముంది. ఒక వేళ అభ్యర్థుల సంఖ్య 25 వేల నుంచి 50 వేలలోపు ఉంటే.. రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించే అవకాశముంటుంది. కానీ, అభ్యర్థుల సంఖ్య లక్ష దాటిన సందర్భాల్లో ఓఎంఆర్ పద్దతిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను OMR పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది టీఎస్‌పీఎస్సీ.
గతేడాది ఏప్రిల్ 26న రాష్ట్రంలోని 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో 25,050 మందిని క్వాలిఫై అయి.. మెయిన్స్‌కు ఎంపిక చేస్తూ టీఎస్పీఎస్పీ ఫలితాలను విడుదల చేసింది. అనంతరం అనూహ్యంగా పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తం పెద్దఎత్తున అభ్యర్థుల, ప్రతిపక్షాల ఆందోళనలు చేశారు. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రీషెడ్యూల్ చేసిన పరీక్షలకు కమిషన్ తాజా తేదీలను ప్రకటించింది. పరీక్షలను ఎటువంటి వివాదాలకు తావు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పరీక్ష విభాగాన్ని తీసుకొచ్చింది. టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా బీఎం సంతోష్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించింది. అంతేకాకుండా, కమిషన్ పనితీరును బలోపేతం చేయడానికి అదనపు పోస్టులలో ఉద్యోగాలతో భర్తీ చేశారు.