టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు మూడు జిల్లాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల స్వగ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సిట్ అధికారులు మంగళవారంనాడు సోదాలు నిర్వహిస్తున్నారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ బృందం తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. హైద్రాబాద్, మహబూబ్ నగర్, జగిత్యాలలలో ఇవాళ సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇశ్లలో సిట్ బృందం సోదాలు చేస్తుంది.
రేణుకతో పాటు ఆమె భర్త డాక్యానాయక్ తో కలిసి హైద్రాబాద్ లోని లంగర్ హౌజ్ లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.. లంగర్ హౌస్ సన్ సిటీలోని కాళీమందిర్ కు వెళ్లి అనుమానితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లంగర్ హౌజ్ నుండి రేణుక స్వంత ఊరు గండీడ్ కు సిట్ అధికారులు వెళ్లారు. అక్కడ విచారణ చేస్తున్నారు. రాజశేఖర్ స్వంతూరు తాటిపల్లి గ్రామంలో కూడ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైద్రాబాద్ మణికొండలోని రాజశేఖర్ రెడ్డి ఇంట్లో సిట్ బృందం తనిఖీలు చేసింది. రాజశేఖర్ రెడ్డి ఇంట్లో గ్రూప్-1 ప్రశ్నాపత్రానిక సంబంధించిన జీరాక్స్ పేపర్లను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు అంశంపై విపక్షాలు ప్రబుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ కార్యాలయం ఈ వ్యవహరాన్ని చక్కబెట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించారన్నారు.
తొలుత ఈ కేసును బేగంపేట పోలీసులు విచారించారు. ఈ కేసు విచారణను సిట్ కు అప్పగించింది ప్రభుత్వం.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులను కస్టడీలోకి తీసుకుని సిట్ బృందం విచారిస్తుంది.
also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై రిపోర్టు ఇవ్వాలి: సిట్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం
పేపర్ లీక్ కేసును సీబీఐతో విచారించాలని ఎన్ఎస్‌యూఐ డిమాండ్ చేస్తుంది.ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో ఎన్ఎస్‌యూఐ పిటిషన్ దాఖలు చేసింది.