
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఈరోజు ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనితా రామచంద్రన్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్.. అనితా రాచంద్రన్ వద్ద పీఏగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణలో భాగంగా టీఎస్‌పీఎస్సీ కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌లకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ ఆధ్వర్యంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం నడుస్తున్న నేపథ్యంలోనే.. అనితా రామచంద్రన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. అలాగే టీఎస్‌పీఎస్సీ కమిషన్ సభ్యుల వాంగూల్మాలను నమోదు చేయాలని సిట్ చూస్తోంది. కమిషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది నియామక ప్రక్రియపై, వారి విధులకు సంబంధించి కూడా సిట్ వారిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌లో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు.