ప‌రీక్ష త‌ర్వాత కొన్ని పేప‌ర్లను క‌లిపేందుకు ఆస్కార‌మే లేదు..: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్‌పీఎస్సీ వివరణ

By Sumanth Kanukula  |  First Published Sep 28, 2023, 5:07 PM IST

 జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై టీఎస్‌పీఎస్సీ వివ‌ర‌ణ ఇచ్చింది. 258 పేప‌ర్లు అద‌నంగా వ‌చ్చాయ‌న్న ఆరోప‌ణ‌ల‌ను తోపిపుచ్చింది. 


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్ వెలువరించిన తీర్పు సబబేనని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై టీఎస్‌పీఎస్సీ వివ‌ర‌ణ ఇచ్చింది. 258 పేప‌ర్లు అద‌నంగా వ‌చ్చాయ‌న్న ఆరోప‌ణ‌ల‌ను తోపిపుచ్చింది. పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదని పేర్కొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రోజు జిల్లాల కలెక్టర్లు నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా.. 2,33,248 మంది ప‌రీక్ష రాసిన‌ట్టు ప్ర‌క‌ట‌న చేశామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

పారదర్శకత కోసం అదే విషయాన్ని మీడియాకు చెప్పడం జరిగిందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఓఎంఆర్ స్కానింగ్‌లో 2,33,506 మంది ప‌రీక్ష రాసిన‌ట్లు తేలిందని చెప్పింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ 33 జిల్లాల్లో 994 ప‌రీక్షా కేంద్రాల్లో నిర్వ‌హించాం. ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష రాశారని.. అలాంటప్పుడు అభ్యర్థుల అంకెల్లో స్వ‌ల్పమార్పులు స‌హజ‌మేనని పేర్కొంది. స్కానింగ్ త‌ర్వాత తుది సంఖ్య ప్ర‌క‌టించామని చెప్పింది. ప‌రీక్ష త‌ర్వాత కొన్ని పేప‌ర్లు క‌లిపేందుకు ఆస్కార‌మే లేదని.. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేదని టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచచింది. 

Latest Videos

ఇక, గతంలో పేపర్ లీక్‌ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దైన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ మరోసారి నిర్వహించింది. అయితే పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, నిర్వాహణ అనుమానస్పదంగా ఉందని  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆలూరు గిరిధర్ రావు వాదిస్తూ.. నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించే సమయంలో టీఎస్‌పీఎస్సీ అధికారులు బయోమెట్రిక్ వివరాలను సేకరించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లలో హాల్ టికెట్ నెంబర్లు లేవని చెప్పారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన జస్టిస్ పి మాధవీ దేవి నేతృత్వంలోని తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్..  గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. అయితే దీనిపై టీఎస్‌పీఎస్సీ హైకోర్టు డివిజన్ ముందు అప్పీల్‌కు వెళ్లింది. అయితే డివిజన్ బెంచ్ కూడా.. సింగిల్ జడ్జి బెంచి ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది. టీఎస్‌పీఎస్సీ వెలువరించిన నోటిఫికేషన్‌లోని నిబంధనలకు అటు కమిషన్‌,  ఇటు అభ్యర్థులు కూడా కట్టుబడి ఉండాలని పేర్కొంది. అన్ని అంశాలనను పరిశీలించిన తర్వాత సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని.. అందులో తాము జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. 

click me!